
IND vs ENG Test: తడబడిన భారత్.. ఆదుకున్న కరుణ్ నాయర్.. ఓవల్‌లో భారత్ 204/6
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌లోని లండన్ ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదవ టెస్టులో భారత జట్టు బ్యాటింగ్‌లో నిరాశ పరిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 కీలక వికెట్లను కోల్పోయి కేవలం 204 పరుగులకే పరిమితమైంది. వరుస వికెట్లను కోల్పోయిన పరిస్థితిలో, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ నిలకడగా ఆడుతూ అర్థశతకం సాధించి జట్టును కాస్త నిలబెట్టాడు. అతను 98 బంతుల్లో 52 పరుగులు చేసి ఇంకా క్రీజులో కొనసాగుతున్నాడు. అతనితో పాటు వాషింగ్టన్ సుందర్ (19 పరుగులు) కూడా క్రీజులోనే ఉన్నాడు.
వివరాలు
వర్షం ప్రభావంతో బ్యాటింగ్ లో విఫలమైన భారత బ్యాటర్లు..
ఇతర భారత బ్యాట్స్‌మన్లను చూస్తే, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (2), కేఎల్ రాహుల్ (14), రవీంద్ర జడేజా (9), కెప్టెన్ శుభమన్ గిల్ (21) తీవ్రంగా నిరాశపరిచారు. అయితే, డెబ్యూట్ ప్లేయర్ సాయి సుదర్శన్ (38) మాత్రం కొంతవరకు బాగానే ఆడి ఆకట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఇంగ్లండ్‌కు జోష్ టంగ్, అట్కిన్సన్ చెరో రెండు వికెట్లు తీస్తే, క్రిస్ వోక్స్ ఒక వికెట్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ టెస్టులో భారత బ్యాటింగ్ విఫలానికి ప్రధాన కారణంగా వర్షాన్ని చెప్పుకోవాలి. ఓవల్ మైదానంలో వరుసగా వాన పడటంతో మైదానం తేమగా మారిపోయింది. ఫలితంగా ఇంగ్లండ్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు ఏర్పడి, భారత బ్యాటర్లపై వారంత ఒత్తిడి తీసుకొచ్చారు.
వివరాలు
రెండో రోజు పటిష్టమైన బ్యాటింగ్ చేస్తేనే మ్యాచ్ లో నిలవనున్న భారత్..
ఇలా వరుస సెషన్లలో వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఒత్తడి పెరిగింది. మరోవైపు, భారత కెప్టెన్ గిల్ ఈ టెస్టులోనూ టాస్ ఓడిపోవడంతో జట్టు వ్యూహాలపై ప్రతికూల ప్రభావం పడింది. రెండో రోజు ఆటలో భారత్ సత్తా చూపించాలంటే, బ్యాటింగ్ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే,ఈ మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోయే ప్రమాదం భారత్‌కు ఎదురవుతుంది. ఇదిలా ఉండగా,భారత్ ఇన్నింగ్స్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్‌లో 13వఓవర్‌ను బౌలింగ్ చేసిన టంగ్,భారత బ్యాట్స్‌మన్ సాయి సుదర్శన్‌కు యార్కర్ బంతిని విసిరాడు. దాన్ని సాయి అడ్డుకోలేక కింద పడిపోయాడు. బంతి నేరుగా ప్యాడ్స్‌ను తాకడంతో టంగ్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు.
వివరాలు
అంపైర్లు ఆటగాళ్లకు ఎటువంటి సంకేతాలు ఇవ్వకూడదు
అంపైర్ ధర్మసేన ఆ అప్పీల్‌ను తిరస్కరించినప్పటికీ, అవుట్ కాదని చెబుతూనే బంతి ముందే బ్యాట్‌కు తాకిందన్న సంకేతాన్ని తన వేళ్లతో ఇంగ్లండ్ ప్లేయర్లకు చూపించాడు. అయితే, ఐసీసీ నిబంధనల ప్రకారం, డీఆర్‌ఎస్‌కు ఇచ్చే 15 సెకన్ల గడువు ముగిసే వరకూ అంపైర్లు ఆటగాళ్లకు ఎటువంటి సంకేతాలు ఇవ్వకూడదు. కానీ ధర్మసేన చేసిన ఈ సంకేతంతో ఇంగ్లండ్‌కు పరోక్షంగా సహకారం చేసినట్లయ్యింది. ఈ చర్యపై క్రికెట్ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.