
Radhika Yadav:టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి తండ్రికి బహుళ ఆస్తులు.. నెలకు రూ.17 లక్షల ఆదాయం!
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాకు చెందిన రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఆమెను తండ్రి దీపక్ యాదవ్ కాల్చిచంపిన ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. కుమార్తె తన సంపాదనతోనే తండ్రి బతుకుతున్నాడని అర్థమయ్యేలా మాట్లాడిందని,దీనికే మనస్తాపానికి గురైన తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నవారు మాత్రం ఇది పూర్తిగా అవాస్తవమని, అసలు సంగతి వేరే ఉందని చెబుతున్నారు. వారు ఈ విషయంపై ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. 25 ఏళ్ల రాధికా యాదవ్ గురుగ్రామ్‌లో తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తూ, రాష్ట్రస్థాయి టెన్నిస్ పోటీల్లో పాల్గొంటూ మంచి పేరు తెచ్చుకుంది.
వివరాలు
నెలకు రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఆదాయం
గురువారం రోజున ఆమె ఇంట్లో వంట చేస్తున్న సమయంలో, ఆమె తండ్రి దీపక్ యాదవ్ ఆమెపై వెనకనుండి తుపాకీతో కాల్చి చంపాడు. దీపక్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణలో తన నేరాన్ని అంగీకరించినట్టు అధికారులు తెలిపారు. దీపక్ స్వస్థలమైన వజీరాబాద్ గ్రామానికి చెందిన అతని స్నేహితులు మీడియాతో మాట్లాడుతూ, అతనికి గురుగ్రామ్‌లో బహుళ ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఆస్తుల అద్దెతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ప్రతి నెలా రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకూ ఆదాయం వస్తోందని చెప్పారు.
వివరాలు
రూ.రెండు లక్షలు పెట్టి రాకెట్లు
"దీపక్ వద్ద విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉంది. అది ఆయన గ్రామంలో అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి తన కూతురి డబ్బుపై ఆధారపడతాడా? తన కుమార్తె టెన్నిస్‌లో రాణించాలనే తపనతో ఆయన రూ.2 లక్షలు ఖర్చుపెట్టి రాకెట్లు కూడా కొన్నాడు. తన కూతురిని ఎంతగానో ప్రేమించాడు. ఈ హత్యకు కారణం టెన్నిస్ కాదేమో.. మరో కారణం ఉండొచ్చు," అని వారు అభిప్రాయపడ్డారు.
వివరాలు
రాధిక టెన్నిస్ అకాడమీని నిర్వహించడం తండ్రికి ఇష్టం లేకే..
ఇక దీపక్ వాడిన తుపాకీ మోడల్ సామాన్య ప్రజల వద్ద ఉండటం సాధ్యమయ్యే విషయమేమీ కాదని, ఇది కూడా విచారణలో కీలక అంశంగా మారింది. రాధిక టెన్నిస్ అకాడమీని నిర్వహించడం తండ్రికి నచ్చలేదని, ఆ విషయమే తండ్రీకూతుళ్ల మధ్య తగాదాకు దారితీసిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అలాగే రాధిక మ్యూజిక్ రీల్స్ చేయడం కూడా తండ్రికి ఇష్టంగా లేకపోవడం వల్ల అది కూడా హత్యకు ఒక కారణంగా మారి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.