ICC Champions Trophy 2025: పాక్ క్రికెట్ పతనం.. బాబర్ అజామ్ నేతృత్వంపై మాజీ క్రికెటర్ల అసంతృప్తి
ఈ వార్తాకథనం ఏంటి
డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుస పరాజయాలతో ఘోర నిరాశ ఎదురైంది.
రెండు మ్యాచుల్లో ఓడిపోయి సెమీఫైనల్ రేసు నుంచి బయటకు వెళ్లిన పాక్ జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ క్రికెటర్లు ఆగ్రహంతో స్పందిస్తూ జట్టు ప్రదర్శనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజామ్ సేథి స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశం కోసం వన్డే వరల్డ్‌కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కారణంగానే పాక్ క్రికెట్ పతనమైందని ఆయన ఆరోపించారు.
Details
ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ పతనం.. నజామ్ సేథి
పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమే.
ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్‌గా వెలుగొందిన జట్టు, 1990, 1996లో వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న పాక్.. ఇప్పుడు జింబాబ్వేతో సమానంగా మారడం బాధ కలిగిస్తోంది.
1992లో వరల్డ్‌కప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టు, 2016లో టెస్టుల్లోనూ టాప్ ర్యాంక్ దక్కించుకున్న పాక్ క్రికెట్ 2019 నుంచి పతనం దిశగా సాగుతోంది.
ఇది అన్ని విధాలుగా ఇమ్రాన్ ఖాన్ కారణంగానే జరిగింది. ఆయన ప్రధాని అయ్యాక తీసుకున్న అనేక నిర్ణయాలు దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేయడానికి దారితీశాయి. పాక్‌కు అసలు సరిపోని ఆసీస్ హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించి మేనేజ్‌మెంట్ విధానాలను మార్చారు.
Details
పాక్ పరాజయంపై ఇమ్రాన్ ఖాన్ అసంతృప్తి
విదేశీ కోచ్‌లను నియమించడం, సెలెక్షన్‌లో రాజకీయాలు ఎక్కువ కావడం, సెలక్టర్లుగా తన అనుచరులను నియమించడం వంటి అనేక తప్పిదాలు జరిగాయి.
ఈ కారణాలతోనే జట్టులో విభేదాలు పెరిగిపోయాయి, గ్రూపులేర్పడ్డాయి. మేనేజ్‌మెంట్ వీటిని పట్టించుకోకపోవడంతో ఇప్పుడు దారుణమైన ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తోందని నజామ్ సేథి ఆరోపించారు.
ప్రస్తుతం అవినీతి ఆరోపణలతో జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా పాక్ క్రికెట్ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.
'కీలక స్థానాల్లో అనుభవం లేని వారు ఉంటే, టీమ్ సెలెక్షన్‌లో పారదర్శకత లేకుంటే.. పాకిస్థాన్ క్రికెట్ పతనం దిశగానే సాగుతుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
Details
బాబర్ అజామ్‌పై మాజీ క్రికెటర్ షెహజాద్ విమర్శలు
మాజీ కెప్టెన్ అహ్మద్ షెహజాద్ కూడా పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఇలాంటి పరిస్థితుల్లో బాబార్ అజామ్‌ను చూడటం బాధాకరం.
కెరీర్ ప్రారంభించినప్పుడు అతడు పాక్ తరఫున ఎన్నో రికార్డులు నెలకొల్పుతాడని భావించాం. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.
బాబర్ కెప్టెన్సీ సమయంలో జట్టులో మెరిట్ ఆధారంగా సెలెక్షన్ జరగలేదు. తన స్నేహితులను జట్టులోకి తీసుకొని, దేశవాళీ క్రికెట్‌లో రాణించిన వాళ్లను పక్కన పెట్టేశాడు.
ఇక పాక్ క్రికెట్‌లో రాజకీయ జోక్యం సాధారణంగా మారిపోయింది.ఇలాంటి సమయంలో మంచి ఫలితాలు ఎలా వస్తాయని షెహజాద్ విమర్శించాడు.
పాకిస్థాన్ క్రికెట్‌లో రాజకీయ జోక్యం, అనవసరమైన మార్పులు, గ్రూపిజం కారణంగా జట్టు పతనం దిశగా వెళుతోందని మాజీ క్రికెటర్లు చెబుతున్న ముఖ్యాంశం.