LOADING...
Ravichandran Ashwin: ఆలోచించి మాట్లాడాలి.. స్టోక్స్‌పై అశ్విన్ ఫైర్: అశ్విన్‌ 
ఆలోచించి మాట్లాడాలి.. స్టోక్స్‌పై అశ్విన్ ఫైర్: అశ్విన్‌

Ravichandran Ashwin: ఆలోచించి మాట్లాడాలి.. స్టోక్స్‌పై అశ్విన్ ఫైర్: అశ్విన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెండూల్కర్-అండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో టీమిండియా అయిదు టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడింది. ఈ సిరీస్‌ చివరకు 2-2తో సమంగా ముగిసింది. మాంచెస్టర్‌లో నిర్వహించిన నాలుగో టెస్టులో, తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ కొడుతుండగా బంతి అతని కాలికి బలంగా తగిలింది. తీవ్ర నొప్పితో పంత్‌ విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత గోల్ఫ్‌ కార్ట్‌ సహాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అయితే దాని తర్వాతి రోజు ఆట కొనసాగించి, కష్టపడి 54 పరుగులు చేయగలిగాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అతను క్రీజులోకి రాలేదు.

వివరాలు 

వోక్స్‌ ఒంటి చేత్తో బ్యాట్‌ పట్టుకుని ఆడటానికి..

ఈ సంఘటన నేపథ్యంలో టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ టెస్ట్‌ క్రికెట్‌లో గాయపడిన ఆటగాళ్లకు బదులుగా మరొకరిని తీసుకునే అవకాశం ఉండేలా నిబంధనలు మార్చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తీవ్రంగా స్పందిస్తూ, ఆ ప్రతిపాదన , హాస్యాస్పదంగా ఉందంటూ వ్యంగ్యంగా స్పందించాడు. కానీ, అదే బెన్‌స్టోక్స్‌ నాయకత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టే ఓవల్‌లో జరిగిన అయిదో టెస్టులో ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ భుజానికి గాయమవడంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. కానీ, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ విజయానికి 20 పరుగులు అవసరమైన సమయంలో వోక్స్‌ ఒక్కచేత్తో బ్యాట్‌ పట్టుకుని క్రీజులోకి అడుగుపెట్టాల్సి వచ్చింది.

వివరాలు 

క్రికెట్‌లో బెన్‌స్టోక్స్‌ శక్తిసామర్థ్యాలకు నేను వ్యక్తిగతంగా పెద్ద అభిమానిని: అశ్విన్ 

ఈ విషయం గురించి రవిచంద్రన్‌ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా స్పందించారు. "ఈ సిరీస్‌లో జరిగిన ఓ ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనిపిస్తుంది. 'కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. తక్షణమే బదులిస్తుంది'అనే అర్థంలో తమిళ సామెత ఉంది. మనం ఏం చేస్తామో అదే తిరిగి మనకే వస్తుంది. నాలుగో టెస్ట్‌ సందర్భంగా పంత్‌ గాయపడ్డ సమయంలో గంభీర్‌ మీడియాకు స్పందిస్తూ, మ్యాచ్‌ మధ్యలో గాయపడిన ఆటగాళ్లకు ప్రత్యామ్నాయంగా మరొకరిని తీసుకునే నిబంధనలు ఉంటే బాగుంటుందని అన్నాడు. అదే విషయాన్ని స్టోక్స్‌ సమక్షంలో ప్రస్తావించగా, అతడు దాన్ని హాస్యాస్పదంగా కొట్టిపారేశాడు. నేను స్టోక్స్‌ ఆటకు పెద్ద అభిమాని. కానీ అలాంటి సమయాల్లో స్పందించే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది," అంటూ అశ్విన్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

ప్రత్యర్థి జట్టు మీద కాస్తైనా సానుభూతి చూపించాలి: అశ్విన్ 

అలాగే ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ సబ్‌స్టిట్యూట్స్‌పై చెప్పిన మాటలను కూడా అశ్విన్‌ ప్రస్తావించారు. "మైఖేల్‌ వాన్‌ కూడా ఇంజురీ సబ్‌స్టిట్యూట్స్‌ను అనుమతించాలనే అభిప్రాయాన్ని చెప్పాడు. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. మనం ఎదుటి జట్టుపై కొంతమేరైనా మానవత్వం కనపర్చాలి. రిషభ్‌ పంత్‌ స్థాయిలో ఉన్న ఆటగాడు ఇంగ్లాండ్‌ తరఫున ఆడుతూ ఇలాంటి గాయానికి గురైతే ఆ జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో స్టోక్స్‌ ఒక్కసారి ఊహించాలి," అంటూ అశ్విన్‌ కుండబద్దలు కొట్టాడు.