Asia Cup: పాక్-శ్రీలంక మ్యాచ్ రద్దయితే ఫైనల్‌లో ఇండియాతో తలపడే జట్టు ఇదే
ఆసియా కప్‌లో భాగంగా మరో కీలక మ్యాచుకు వర్షం ఆటకం కలిగిస్తోంది. సూపర్-4లో భాగంగా ఇవాళ పాకిస్థాన్- శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచుకు వరుణుడు అడ్డుపడుతున్నాడు. దీంతో మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. ఒకవేళ వర్షం తగ్గకపోతే ఈ మ్యాచుకు రిజర్వ్ డే లేదు. అదే జరిగితే ఇండియాతో ఫైనల్లో తలపడే మరో జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 8 గంటలకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇరు జట్ల మధ్య 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.
శ్రీలంకకు ఫైనల్ చేరడానికి ఎక్కువ అవకాశాలు!
ఇప్పటికే సూపర్-4 స్టేజ్‌లో రెండు మ్యాచులు గెలిచిన భారత్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే.. పాకిస్థాన్ (-1.892) కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న శ్రీలంక (-0.200) ఫైనల్ కి చేరుకుంటుంది. టీమిండియా చేతిలో 228 పరుగుల భారీ తేడాతో పాక్ పరాజయం కావడంతో ఆ జట్టు నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. శ్రీలంకపై బాబర్ సేన నెగ్గితేనే ఫైనల్‌లో భారత్‌తో తలపడటానికి అవకాశం ఉంటుంది. అదే జరిగితే ఆసియా కప్ చరిత్రలో మొదటిసారిగా భారత్-పాకిస్థాన్ తలపడతాయి.