Loading...
Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. తొలి వన్డేలోనే చరిత్ర సృష్టించే ఛాన్స్!
విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. తొలి వన్డేలోనే చరిత్ర సృష్టించే ఛాన్స్!

Virat Kohli: విరాట్ కోహ్లీ ముందు మూడు భారీ రికార్డులు.. తొలి వన్డేలోనే చరిత్ర సృష్టించే ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఆదివారం తెరలేవనుంది. సెప్టెంబర్ 27న తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మరోసారి వన్డే జట్టులో కనిపించనున్నారు. తొలి వన్డేకు ముందు అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంది. వెస్టిండీస్‌తో జరగనున్న ఈ సిరీస్‌లో అతడి ముందు కొన్ని అరుదైన రికార్డులు ఉన్నాయి. ముఖ్యంగా వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయి కోహ్లీని ఊరిస్తోంది. దీంతో తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వివరాలు

15 వేల పరుగులకు 59 పరుగుల దూరంలో..

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో 14,941 పరుగులు సాధించాడు. దీంతో 15 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అతడికి మరో 59 పరుగులు అవసరం.

తొలి వన్డేలోనే ఈ పరుగులు సాధిస్తే.. వన్డే క్రికెట్ చరిత్రలో 15 వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు.

ఈ ఘనత ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. అంతేకాదు.. వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా కూడా కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

దీంతో ఆదివారం జరిగే మ్యాచ్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

వివరాలు

గ్రీన్‌ఫీల్డ్‌లో కోహ్లీ రికార్డు అదుర్స్

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో విరాట్ కోహ్లీకి ఇప్పటికే అద్భుతమైన రికార్డు ఉంది.

ఈ మైదానంలో అతడు ఆడిన రెండు వన్డేల్లోనూ ఔట్ కాలేదు. 2018లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 33 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఆ తర్వాత 2023లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో కోహ్లీ ఇప్పటివరకు ఆడిన రెండు వన్డే ఇన్నింగ్స్‌ల్లో కలిపి 199 పరుగులు సాధించాడు.

రెండు సందర్భాల్లోనూ నాటౌట్‌గా ఉండటం విశేషం. ఇప్పుడు అదే వేదికపై మరోసారి వెస్టిండీస్‌ను ఎదుర్కోబోతుండటంతో ఈ రికార్డుపైనా అందరి దృష్టి ఉంది.

ADVERTISEMENT

వివరాలు

సచిన్ రికార్డుపై కూడా కన్ను..

సొంత గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలోనూ విరాట్ కోహ్లీ మరో మైలురాయికి చేరువలో ఉన్నాడు.

స్వదేశంలో టెస్టులు, వన్డేలు కలిపి కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 41 అంతర్జాతీయ శతకాలు ఉన్నాయి. కాగా, సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 42 అంతర్జాతీయ శతకాలు సాధించాడు.

వెస్టిండీస్‌తో జరిగే ఈ సిరీస్‌లో కోహ్లీ ఒక శతకం సాధిస్తే సచిన్ రికార్డును సమం చేసే అవకాశం ఉంటుంది. అదే రెండు శతకాలు సాధిస్తే సచిన్ రికార్డును అధిగమించవచ్చు.

దీంతో మూడు మ్యాచ్‌ల వెస్టిండీస్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

15 వేల వన్డే పరుగుల మైలురాయితో పాటు స్వదేశంలో అంతర్జాతీయ శతకాల రికార్డుపైనా కోహ్లీ దృష్టి పెట్టనున్నాడు.

ADVERTISEMENT