Rahul Dravid: టీమిండియా ఓటమి ఎఫెక్టు.. రాహుల్ ద్రావిడ్‌పై తొలి వేటు?
వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఆరోసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది. ఇక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ రెండు సంవత్సరాల కాల పరిమితి కూడా ముగిసింది. ఈ నెలాఖరు వరకు బీసీసీఐ ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా అపాయింట్ చేసింది. అయితే ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించాలా? లేదా? అనేది బీసీసీఐ తేల్చాల్సి ఉంది. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనూ రాహుల్ ద్రావిడ్ ఈ అంశాన్ని ప్రస్తావించాడు. తన టెన్యుర్ పొడిగింపునకు పెద్దగా ప్రాధాన్యత లేదని పేర్కొన్నాడు.
రోహిత్ సేనకు అండగా రాహుల్ ద్రావిడ్
ఈ మ్యాచులో ఇంకా 30 నుచి 40 పరుగులు చేసి ఫలితం వేరేలా ఉండేదని, తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేశామని, అయితే రోహిత్ ఔటయ్యాక రన్స్ రాలేదని ద్రావిడ్ చెప్పాడు. రోహిత్ శర్మ ఓ అసాధారణ లీడర్ అని, టోర్నీ మొదలైనప్పటి నుంచి ఎన్నో మర్చిపోలేని క్షణాలను అభిమానులకు అందించారన్నారు. ఓటమితో రోహిత్ సేన విచారంలో కూరుకుపోయిందని, డ్రెస్సింగ్ రూంలో వారి పరిస్థితి చూసి తనకు కష్టంగా అనిపించిందని ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. మరో సూర్యోదయం వస్తుందని, క్రీడాకారులుగా తాము జయాపజయాలకు అతీతంగా ముందడుగు వేస్తామన్నారు.