Virat Kohli : విరాట్ కోహ్లీకి నా వీడియోలు అంటే చాలా ఇష్టం : జార్వో
2021 భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా భారత్ జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచుకు అంతరాయం కలిగించిన 'జార్వో 69' గురించి మనందరికి తెలిసిందే. ఇంగ్లండ్ ప్రముఖ యూట్యూబర్ జార్వో (Jarvo) మరోసారి వరల్డ్ కప్ మ్యాచులో ప్రత్యక్షమయ్యాడు. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా జార్వో టీమిండియా జెర్సీతో మైదానంలోకి వచ్చాడు. భారత ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ అతడిని బయటికి పంపేందుకు ప్రయత్నించారు. వెంటనే సిబ్బంది వచ్చి అతడిని బయటికి తీసుకెళ్లారు. విరాట్ కోహ్లీ (Virat Kohli) కి తన వీడియోలు అంటే ఇష్టమని, కానీ ఇప్పుడు మాత్రం దీనిని ఆపేసేయ్ అని మ్యాచ్ సందర్భంగా విరాట్ తనతో చెప్పినట్లు జార్వో సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ప్రపంచ కప్ మ్యాచులకు జార్వో హజరు కాకుండా నిషేధం
ఇక జార్వో చర్యలపై ఐసీసీ (ICC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ కప్‌లలో మిగతా మ్యాచులకు జార్వో హాజరు కాకుండా నిషేధం విధించింది. వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ప్రతి ఒక్కరి భద్రత తమ బాధ్యత అని, మిగతా మ్యాచుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని ఐసీసీ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా అవసరమైతే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొనేందుకు వెనుకాడమని ఐసీసీ వెల్లడించింది.