ODI World Cup 2023: ఉత్కంఠ వీడింది.. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వీసాలొచ్చేశాయి!
2023 ప్రపంచకప్‌నకు భారత్‌కు రావడానికి పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాల సమస్య ఎదురైంది. ఎట్టకేలకు వారికి వీసాలు రావడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. వీసా మంజూరు విషయంలో ఆలస్యం కావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆందోళన చేస్తూ, ఐసీసీకి లేఖ రాయడంతో సమస్య పరిష్కారమైంది. దీంతో యథావిధిగా పాక్ జట్టు ప్లేయర్లు, సిబ్బంది సెప్టెంబర్ 27న హైదరాబాద్‌కు రానున్నారు. వన్డే ప్రపంచ కప్ కోసం ఇండియాకు వచ్చేందుకు పాకిస్థాన్ జట్టుకు వీసాలను భారత ప్రభుత్వం నేడు మంజూరు చేసింది. మరో 24 గంటల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల చేతుల్లో వీసాలు ఉండనున్నాయి.
అక్టోబర్ 14న భారత్ తో తలపడనున్న పాక్
ముందుగా దుబాయ్ కి వెళ్లి అక్కడి నుంచి ఇండియాకు రావాలని తొలుత భావించిన పాకిస్థాన్, భారత్ వీసాలు ఆలస్యం కారణంగా ఆ ప్లాన్‌ను ఉపసంహరించుకుంది. ప్రపంచ కప్ వామప్ మ్యాచులో భాగంగా హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్29న న్యూజిలాండ్‌తో పాకిస్థాన్ జట్టు తలపడనుంది. ఇక ప్రపంచ కప్‌లో అక్టోబర్ 6న నెదర్లాండ్స్ జట్టుతో పాక్ తొలి మ్యాచులో పోటీ పడనుంది. పాకిస్థాన్ చివరిసారిగా 2016లో టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా మరోసారి టీమిండియా-పాక్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.