
Asia Cup 2025: అభిషేక్ శర్మకు జోడీ ఎవరు..? క్లారిటీ ఇచ్చిన క్రిష్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ ముమ్మర సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇదే సమయంలో మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. హర్భజన్ సింగ్ ఇప్పటికే తన జట్టును ప్రకటించగా, తాజాగా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తన అంచనాలు పంచుకున్నారు. ఓపెనింగ్ కాంబినేషన్‌పై మాట్లాడుతూ శ్రీకాంత్ 'సంజు శాంసన్ షార్ట్ బాల్‌కి ఇబ్బందిపడుతున్నాడు. కాబట్టి అతడిని ఓపెనర్‌గా తీసుకోవడం కష్టమే. నేను సెలెక్టర్‌ని అయితే అభిషేక్ శర్మతో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు వైభవ్ సూర్యవంశీ లేదా సాయి సుదర్శన్‌ను ఎంచుకుంటా. ఈ ముగ్గురిలో ఎవరైనా సరైన ఎంపిక అవుతారు. యశస్వీ జైస్వాల్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Details
సంజు శాంసన్ కంటే జితేశ్ శర్మ బెటర్ ఆప్షన్
సాయి సుదర్శన్ ఐపీఎల్ లో ఆరెంజ్ కాప్ హోల్డర్‌గా రాణించాడు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తు టీ20 వరల్డ్‌కప్ జట్టులోనూ చోటు దక్కించుకోవాలని వ్యాఖ్యానించారు. వికెట్‌కీపర్ ఎంపికపై ఆయన అభిప్రాయం వెల్లడిస్తూ సంజు శాంసన్ కంటే జితేశ్ శర్మ బెటర్ ఆప్షన్. అతడు జట్టుకు ఎక్కువ స్థిరత్వాన్ని ఇస్తాడని అన్నారు. ఇక శుభ్‌మన్ గిల్ అవకాశాలపై కూడా చర్చ నడుస్తోంది. గత టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా ఆడగా, వారికి బ్యాకప్‌గా గిల్‌కు కాకుండా యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇచ్చారు.
Details
వన్‌డౌన్ స్థానం కోసం గిల్?
ఇప్పుడు రోహిత్, కోహ్లీలు టీ20కి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో గిల్‌కు మరలా అవకాశం లభించవచ్చని అంచనా. రిషభ్ పంత్ గాయంతో తప్పుకున్నందున, వన్‌డౌన్ స్థానాన్ని భర్తీ చేయడం కోసం గిల్‌పై సెలెక్టర్ల దృష్టి పడే అవకాశం ఉంది. కెప్టెన్సీ విషయంలో సూర్యకుమార్ యాదవ్‌పై పెద్ద ఆశలున్నాయి. ఈ టోర్నీలో బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసి జట్టుకు కప్పు అందిస్తే, వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు సారథ్య బాధ్యతలు కొనసాగించవచ్చు. లేదంటే మాత్రం భవిష్యత్తులో గిల్‌కే పగ్గాలు అప్పగించే పరిస్థితి తలెత్తుతుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.