ముంబై ఇండియన్స్ తరుపున రాణించిన అర్షద్ ఖాన్ ఎవరు?
బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ 22 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 84 పరుగులు, ఫాఫ్ డుప్లిసెస్ 73 పరుగులతో రాణించడంతో, ముంబై నిర్ధేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా జయించింది. ముంబై ఇండియన్స్ తరుపున ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ అర్షద్ ఖాన్ మెరిశాడు. 2.2 ఓవర్లలో 28 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అటు బ్యాటింగ్ లో 9 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 15 పరుగులు చేశాడు. బెంగళూర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసెస్ వికెట్ తీసి సత్తా చాటాడు.
సీకే నాయుడు ట్రోఫీలో ప్రతిభ చాటిన అర్షద్ ఖాన్
అర్షద్ డిసెంబర్ 20, 1997న మధ్యప్రదేశ్‌లోని సియోనిలో జన్మించాడు. అతను మొదట 2019-20 అండర్-25 సీకే నాయుడు ట్రోఫీలో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో 36 వికెట్లు తీసి అత్యధికంగా 400 పరుగులు చేశాడు. ఎంఐ అతడిని రూ. 2022 వేలంలో 20 లక్షలకు కొనుగోలు చేయగా.. గాయం కారణంగా ఆ సీజన్‌కు అర్షద్ ఖాన్ దూరమయ్యాడు. అప్పుడు అతని స్థానంలో కుమార్ కార్తికేయను తీసుకున్నారు. అర్షద్ ఇప్పటివరకు మూడు లిస్ట్-ఎ మ్యాచ్ లు ఆడాడు. అతను ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో మూడు వికెట్లు తీసి, 40 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో అందరి దృష్టిని అకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.