Page Loader
IPL 2025: ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరిది..? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరిది..? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?

IPL 2025: ఫైనల్ మ్యాచ్ రద్దయితే ట్రోఫీ ఎవరిది..? ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 టైటిల్ పోరులో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ ఫైనల్లో ఎవరు గెలిచినా... ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచిన జట్టుగా నిలవనుంది. ఎందుకంటే ఈ రెండు జట్లు 2008 నుంచే ఐపీఎల్‌లో పాల్గొన్నా ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోలేకపోయాయి. ఇప్పటికే లీగ్ స్టేజ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ వరుసగా మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్‌పై విజయం సాధించిన RCB నేరుగా ఫైనల్‌కు చేరగా... రెండవ క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన పంజాబ్ కింగ్స్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది.

Details

జూన్ 3న వర్షం..? ఐపీఎల్ ఫైనల్‌పై ప్రభావమా?

204 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో కీలక పాత్ర పోషించాడు. అయితే రెండవ క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. రిజర్వ్ డే లేకపోవడంతో మ్యాచ్ రద్దయితే లీగ్ స్టేజ్‌లో మెరుగైన స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్‌కు ఫైనల్ బెర్త్ లభించేది. అయితే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ పూర్తిగా జరిపి ఫలితం వెల్లడించారు. అహ్మదాబాద్ వాతావరణ నివేదికల ప్రకారం జూన్ 3న వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం నుంచి వర్షం సూచనలు ఉండగా, రాత్రి మ్యాచ్ సమయంలో కూడా వర్షం అంతరాయం కలిగించవచ్చని అంచనా. దీని వల్ల ఐపీఎల్ ఫైనల్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి రాకముందే అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.

Details

ఫైనల్‌కు రిజర్వ్ డే ఉందా?

అవును. ఐపీఎల్ 2025 ఫైనల్‌కు రిజర్వ్ డే అందుబాటులో ఉంది. జూన్ 3న మ్యాచ్ పూర్తి కాలేని పరిస్థితిలో జూన్ 4న మళ్లీ ఫైనల్ నిర్వహిస్తారు. రెండవ రోజూ వర్షం కారణంగా ఆట అంతరించినా, కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరిపేందుకు ప్రయత్నిస్తారు. అది సాధ్యంకాకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించవచ్చు. ఇక రెండు రోజులూ మ్యాచ్ నిర్వహణ అసాధ్యమైతే, లీగ్ స్టేజ్‌లో మొదటి స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్‌నే ఐపీఎల్ 2025 విజేతగా ప్రకటిస్తారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఇది అమలవుతుంది. ఈనేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌పై అభిమానుల ఉత్కంఠ మరింత పెరిగింది. టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్, బెంగళూరు అభిమానులకు వర్షం షాక్ ఇవ్వకూడదని అభిమానులు వేచి చూస్తున్నారు.