Page Loader
WI vs AUS: ఉత్కంఠగా సాగుతున్న పోరు..ఆసీస్ పై 10 పరుగుల స్వల్ప ఆధిక్యంలో వెస్టిండీస్ 
ఉత్కంఠగా సాగుతున్న పోరు..ఆసీస్ పై 10 పరుగుల స్వల్ప ఆధిక్యంలో వెస్టిండీస్

WI vs AUS: ఉత్కంఠగా సాగుతున్న పోరు..ఆసీస్ పై 10 పరుగుల స్వల్ప ఆధిక్యంలో వెస్టిండీస్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 27, 2025
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా 82 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ట్రావిస్ హెడ్ 13 పరుగులు, వెబ్‌స్టర్ 19 పరుగులతో క్రీజులో ఉండగా ఆట ముగిసింది.

వివరాలు 

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ - 180 పరుగులకే ఆలౌట్ 

మ్యాచ్ ప్రారంభంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 180 పరుగులకే పరిమితమయ్యింది. ఉస్మాన్ ఖవాజా 47, ట్రావిస్ హెడ్ 59 పరుగులతో పోరాడగా, మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. విండీస్ బౌలర్ జెడెన్ సీల్స్ తన భీకర బౌలింగ్‌తో ఆసీస్‌ టాప్ ఆర్డర్‌ను ధ్వంసం చేశాడు. అతడు కేవలం 60 పరుగులు ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా, శమర్ జోసెఫ్ కూడా బంతితో అద్భుతంగా రాణించాడు. అతడు 46 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి ఆసీస్‌ను కుదేలు చేశాడు.

వివరాలు 

విండీస్ తొలి ఇన్నింగ్స్ - 190 పరుగులు 

ఆసీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసినప్పటికీ, వెస్టిండీస్‌కు పెద్దగా లాభం కలగలేదు. ఎందుకంటే వారు తమ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దాంతో కేవలం 10 పరుగుల లీడ్‌నే సాధించగలిగారు. విండీస్ బ్యాటింగ్‌లో షై హోప్ 48 పరుగులు చేయగా, రోస్టన్ చేస్ 44 పరుగులతో సహాయపడ్డాడు. ఆసీస్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కమిన్స్, హేజిల్‌వుడ్ తలో 2 వికెట్లు తీసారు.

వివరాలు 

ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబాటు 

తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహాలో ఆడింది. సామ్ కొన్స్టాస్ 5, ఖవాజా 15, ఇంగ్లిస్ 12, కామెరూన్ గ్రీన్ 15 పరుగులు మాత్రమే చేయగలిగారు. విండీస్ బౌలింగ్‌లో శమర్ జోసెఫ్, జెడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్, గ్రీవ్స్ తలో వికెట్ తీసి ఆసీస్‌ను నిరాశకు గురి చేశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 92 పరుగుల వద్ద నిలిచింది. ఈ క్రమంలో మూడో రోజు ఆటతో ఈ ఉత్కంఠ భరిత పోరుకు ఫలితం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.