
Asia Cup 2025: ఆసియా కప్ 2025కు బ్రేక్ పడనుందా.. బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ కీలక నిర్ణయం?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సెప్టెంబర్‌లో ప్రారంభమవాల్సిన ఈ టోర్నమెంట్ రద్దు అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా భారత్, శ్రీలంక క్రికెట్ బోర్డులు జులై 24న ఢాకాలో జరగనున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) సమావేశానికి హాజరుకావడం లేదు. టెలికాం ఆసియా స్పోర్ట్ నివేదిక ప్రకారం, టోర్నీ ప్రారంభానికి రెండు నెలల సమయం మిగిలి ఉన్న వేళ ఈ రెండు బోర్డులు తీసుకున్న నిర్ణయం, ఆసియా కప్ భవిష్యత్తుపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
Details
సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం ఇదే..
ఈసారి ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి టోర్నీ ఆరంభమవొచ్చు. కానీ జూలై 24న ఢాకాలో జరగనున్న ఏసీసీ సమావేశానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), శ్రీలంక క్రికెట్ హాజరుకావడం లేదు. దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితి సవ్యంగా లేదన్న కారణంతో, ఢాకాలో సమావేశం నిర్వహించడాన్ని సరైనదిగా భావించలేదు.
Details
బీసీసీఐ, బంగ్లాదేశ్ టూర్ వాయిదా..
ఇటీవలే బీసీసీఐ, బంగ్లాదేశ్ టూర్‌ను నిరవధికంగా వాయిదా వేసింది. ఆగస్టులో జరగాల్సిన ఈ పర్యటనను రద్దు చేయాలని బీసీసీ బంగ్లాదేశ్ బోర్డును ఒప్పించింది. అదే సమయంలో ఏసీసీ మాత్రం ఢాకాలో సమావేశం నిర్వహించడంపై భారత్ అసంతృప్తిగా ఉంది. ఏసీసీ వైఖరి బీసీసీఐ మౌనం ప్రసార హక్కుదారులు, స్పాన్సర్లను గందరగోళానికి గురి చేస్తోందని ఏసీసీ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను అనుసరించాలని సూచించగా, బీసీసీఐ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ACC, భారతదేశం ఈ టోర్నీ నిర్వహించాలనుకుంటుందా లేదా అన్నది తెలుసుకునేందుకు అధికారికంగా విచారించింది. సభ్య దేశాలకు నిర్ణయం తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చింది. హాజరు కాని బోర్డులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చని తెలిపినా భారత్, శ్రీలంక స్పందించలేదు.
Details
ఢాకాలో సమావేశం నిర్వహించడం తగదు
ఢాకాలో సమావేశం నిర్వహించడం తగదని బీసీసీఐ పేర్కొంది. రాజకీయంగా ఉద్విగ్నత ఉన్న వేళ ముఖ్యమైన సమావేశం అక్కడ పెట్టడాన్ని వ్యతిరేకించింది. ఆ సమయంలో బీసీసీఐ, శ్రీలంక కలిసి పరిమిత ఓవర్ల సిరీస్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Details
ప్రత్యామ్నాయ సిరీస్‌పై ఆలోచనలు
ఆసియా కప్ వాయిదా వేస్తే లేదా రద్దయితే, భారత జట్టు ఖాళీగా ఉండకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే మూడు, నాలుగు బోర్డుల నుంచి సిరీస్ కోసం ప్రతిపాదనలు వచ్చాయని తెలుస్తోంది. ఆసియా కప్‌ను UAEలో నిర్వహించే అవకాశాలు ఉన్నప్పటికీ, బీసీసీఐ ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తోంది. పాక్ హాకీ జట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, క్రికెట్ విషయంలో మాత్రం ప్రభుత్వం మెట్టు మీద మెట్టు వేసేలా వ్యవహరిస్తోంది. ACC ఆకట్టుకోలేకపోతే, BCCI ఆసియా కప్ నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉందని సమాచారం. టోర్నమెంట్ ఆతిథ్య హక్కుల విషయంలో భారత్ ఇంకా ఆసక్తిని కోల్పోలేదు. కానీ, ఫార్మాట్, వేదిక, పాలిటిక్స్ అన్నీ కలిసి ఈ టోర్నీని సంక్లిష్ట దిశగా తీసుకెళ్తున్నాయి.