World Cup 2023 : ఆ రెండు స్టేడియాలు, ఆ రెండు జట్లతో టీమిండియాకు గండం!
వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ టోర్నీకి ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ కప్ ఏయే ప్రదేశాల్లో మ్యాచులు జరుగుతాయో కూడా తెలిసిపోయింది. ఏ స్టేడియంలో టీమిండియా ఏ జట్లతో తలపడుతుందో కూడా స్పష్టమైంది. ఈ టోర్నీలో మొత్తం 10 వేదికల్లో మ్యాచులు జరుగనున్నాయి. హైదరాబాద్ లో మూడు మ్యాచులు మినహా మిగిలిన అన్ని వేదికల్లో ఐదు మ్యాచులు, అంతకుపైనే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వరల్డ్ కప్ కు టీమిండియా ఆతిథ్యం ఇస్తుండటంతో ఆ జట్టుపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ టోర్నీలో రెండు ముఖ్యమైన మ్యాచులు, జరగాల్సిన రెండు వేదికలు మాత్రం భారత జట్టును ఆందోళనను కలిగిస్తున్నాయి.
టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
భారత జట్టు ఈ ఏడాది ఆస్ట్రేలియాతో ఇండియాలో వన్డే సిరీస్ ఆడింది. అందులో ఒక మ్యాచును చైన్నైలో ఆడారు. ఆ మ్యాచులో టీమిండియా హోరాహోరీగా తలపడింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా ధాటికి భారత బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైంది. చైన్నై స్టేడియంలో ఈసారి ఆస్ట్రేలియాను భారత జట్టు ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. అదే విధంగా ధర్మశాలలో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. అక్కడి పిచ్ పేసర్లకు అనుకూలించడంతో పాటు స్వింగ్ కూడా ఉంటుంది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లతో పటిష్టంగా ఉంది. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ తలపడగా ట్రెంట్ బోల్ట్ షాకిచ్చిన విషయం తెలిసిందే.