World Cup final preview: టీమిండియా ముచ్చటగా మూడోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలుస్తుందా?
ఈ ప్రపంచ కప్‌లో ఓటమి ఎరుగని టీమిండియా ఒకవైపు.. ఐదుసార్లు వరల్ట్ కప్‌ను నెగ్గిన ఆస్ట్రేలియా మరోవైపు.. వెరసి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదకగా ఆదివారం జరగనున్న నిర్ణయాత్మక పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రేపటి మ్యాచ్ ప్రివ్యూపై ఒక లుక్కేద్దాం. ఇప్పటికి వరకు రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్..మూడోసారి టైటిల్‌ను ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆరోసారి విశ్వ విజేతగా నిచిలి ప్రపంచకప్‌లో తన ఆధిపత్యాన్ని చలాయించాలని ఆసీస్ ఆశపడుతోంది. టీమిండియా-ఆస్ట్రేలియా జట్లు 150వన్డేలు ఆడాయి. ఇందులో భారత్ 57విజయాలను అందుకోగా.. ఆస్ట్రేలియా 83సార్లు గెలిచింది. 10మ్యాచ్‌లు అసంపూర్తిగా ముగిశాయి. ప్రపంచ కప్‌లో 13సార్లు ఇరు జట్లు తలపడగా, ఆస్ట్రేలియా 8సార్లు, టీమిండియా 5విజయాలను నమోదు చేసింది.
భారత బ్యాటర్ల గణాంకాలు
విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాతో 48 వన్డేల్లో 53.79 సగటుతో 2,313పరుగులు చేసాడు. ఈ ఫార్మాట్‌లో కోహీకి వన్డేల్లో ఆస్ట్రేలియాపై 8సెంచరీలు, 13అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ 711రన్స్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ప్రపంచ కప్‌లో రోహిత్ 550రన్స్, శ్రేయాస్ 526పరుగులు చేశారు. ఈ ప్రపంచ కప్ రోహిత్ 51సిక్సులతో దడదడలాడించారు. దీంతో ప్రపంచకప్ చరిత్రలో ఎక్కువ సిక్సులు బాదిన క్రికెటర్ల జాబితాలోని మొదటిస్థానంలో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ కూడా ఈ ఏడాది భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది వన్డేల్లో 65.83 సగటుతో 1,580పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్ల గణాంకాలు
ఆస్ట్రేలియా బ్యాటర్లలో డేవిడ్ వార్నర్‌కు టీమిండియాపై వన్డేల్లో మంచి రికార్డు ఉంది. భారత్‌తో ఆడిన 26 వన్డేల్లో 50.62 సగటుతో 1,215 పరుగులు చేశాడు. భారత్‌పై అతనికి ఈ ఫార్మాట్‌లో మూడు సెంచరీలు, తొమ్మిది అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ ప్రపంచ కప్‌లో వార్నర్ 528 పరుగులతో అదరగొట్టాడు. స్టీవ్ స్మిత్‌కు కూడా వన్డేల్లో భారత్‌పై 54.41 సగటుతో 1,306 పరుగులు చేశాడు. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్నాడు. 2023లో మూడు సెంచరీలు చేసిన ఏకైక ఆస్ట్రేలియన్ బ్యాటర్ అతనే. మిచెల్ మార్ష్ 2023లో 49.58 సగటుతో 843 వన్డే పరుగులు చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ 150.18 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఈ ప్రపంచ కప్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీని సాధించాడు.
భారత్, ఆస్ట్రేలియా బౌలింగ్ గణాంకాలు
భారత ఆటగాళ్లలో షమీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. షమీ ఆస్ట్రేలియాపై వన్డేల్లో (5W: 1) 38 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ కప్‌లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ ఈ సంవత్సరం ODIలలో 48 వికెట్లను కలిగి ఉన్నాడు. రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాపై 43 వన్డేల్లో 37 వికెట్లు తీశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే.. ఆడమ్ జంపా 37 వికెట్లతో ఈ ఏడాది వన్డేల్లో ఆస్ట్రేలియాకు అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అందులో 22 వికెట్లు 2023 ప్రపంచకప్‌లో రావడం గమనార్హం. వన్డే ప్రపంచకప్‌లో 19.33 సగటుతో 62 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా మిచెల్ స్టార్క్ నిలిచాడు.
ఈ మైలురాళ్లకు చేరువలో ఇరు జట్ల ఆటగాళ్లు..
వన్డే ప్రపంచకప్‌లో రికీ పాంటింగ్ రికార్డును అధిగమించేందుకు కోహ్లీ మూడు పరుగుల దూరంలో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో 1,000 పరుగులు పూర్తి చేసేందుకు మ్యాక్స్‌వెల్‌కు మరో 101 పరుగులు కావాలి. వన్డేల్లో 7,000 పరుగులు పూర్తి చేసేందుకు వార్నర్‌కు మరో 75 పరుగులు అవసరం. 200 వికెట్లు సాధించడానికి షమీకి ఆరు వికెట్లు అవసరం కాగా, బుమ్రాకు 150 వికెట్ల మార్క్‌ను అందుకోవానికి మూడు వికెట్లు అవసరం. 2023లో 50 వన్డేలు పూర్తి చేసేందుకు కుల్దీప్‌కి రెండు వికెట్లు అవసరం.