
Trump's tariffs: ట్రంప్ టారిఫ్‌లతో అమెరికన్ కుటుంబాలకు ఇంటికి రూ.2 లక్షల నష్టం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ప్రొటెక్షనిస్ట్ ట్రేడ్ పాలసీల ప్రభావం మీద యేల్ యూనివర్శిటీ తాజా రిపోర్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలే ట్రంప్ భారత్, దక్షిణ కొరియా లాంటి మిత్రదేశాలపైనా భారీ టారిఫ్‌లు (25%) విధించగా, ఇవి అమెరికన్ ప్రజలకు తీవ్రంగా దెబ్బతీయబోతున్నట్లు అధ్యయనం హెచ్చరిస్తోంది. ఈ టారిఫ్‌ల వల్ల ప్రతి అమెరికన్ కుటుంబానికి సగటున $2,400 (దాదాపు రూ. 2 లక్షల వరకు) ఆదాయం నష్టమవుతుందని నివేదిక చెబుతోంది. ముఖ్యంగా రోజువారీ వినియోగ వస్తువుల ధరలు పెరగడం వల్లే ఈ నష్టం వస్తుందట. ఫెడ్ రిజర్వ్ నుంచి ఎలాంటి మద్దతు లేకపోతే, ఈ ధరల పెరుగుదల కేవలం జీతాల క్షీణత కాకుండా ద్రవ్యోల్బణం వల్లే జరుగుతుందన్నది స్పష్టం చేస్తోంది.
వివరాలు
కూరగాయల ధరలు 7%వరకు పెరిగే సూచనలు
ఈ విధంగా టారిఫ్‌లు పెడితే ధనికులు పెద్ద మొత్తాలు కోల్పోయినా,పేదలు తమ ఆదాయానికి సంబంధించి పెద్ద శాతాన్ని కోల్పోతారు. ఉదాహరణకి, తక్కువ ఆదాయ గల కుటుంబాలు సగటున $1,300 (రూ. 1.08 లక్షలు)నష్టపోతుంటే, ధనికులు $5,000 వరకూ కోల్పోతున్నా,వారి ఫైనాన్షియల్ స్టేబిలిటీపై అది పెద్దగా ప్రభావం చూపదు. కానీ పేద కుటుంబాలకి ఇది పెద్ద భారం.వినియోగ వస్తువుల్లో ధరలు బాగా పెరగబోతున్నాయి. ముఖ్యంగా,చెప్పులు,హ్యాండ్‌బ్యాగులు లాంటి లెదర్ వస్తువులు 40% వరకు,బట్టలు 38%, టెక్స్‌టైల్ ఉత్పత్తులు 19% వరకు పెరిగే అవకాశం ఉంది. తినే పదార్థాల్లో కూడా సగటు 3.4% ధరలు పెరుగుతాయి.తాజా కూరగాయల ధరలు 7%వరకు పెరిగే సూచనలు ఉన్నాయి.కొత్త కారు కొంటే దాదాపు $5,900 (రూ. 4.8 లక్షల)అదనపు ఖర్చు అవుతుందట!
వివరాలు
ఆర్థిక వృద్ధికి శత్రువులా మారుతున్న టారిఫ్‌లు
ఇవన్నీ కేవలం ధరల పెరుగుదలకే పరిమితం కాకుండా,అమెరికన్ ఆర్థిక వ్యవస్థకే గండికొడుతున్నాయి. యేల్ నివేదిక ప్రకారం,ఈ విధంగా టారిఫ్‌లు కొనసాగితే,2025-26 నాటికి అమెరికా GDP వృద్ధి రేటు 0.5 శాతం తగ్గిపోవచ్చు. అంతేకాదు,2025 చివరికి 5 లక్షల ఉద్యోగాలు నశించవచ్చని హెచ్చరిస్తోంది.ఉద్యోగ రేటు 0.3 శాతం పెరగొచ్చు, అంటే నిరుద్యోగిత మరింత పెరిగే అవకాశం ఉంది. JP Morgan సంస్థ విశ్లేషణ ప్రకారం కూడా, టారిఫ్‌లు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి, దాంతో వినియోగ దారుల కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక వృద్ధికి బ్రేక్ పడుతోంది. టారిఫ్‌ల వల్ల ప్రభుత్వానికి తాత్కాలికంగా $167.7 బిలియన్ల ఆదాయం వచ్చిందన్నా, JP Morgan అంచనా ప్రకారం, ప్రతి కుటుంబానికి ఈ టారిఫ్‌లు వల్ల $1,300 ట్యాక్స్ భారంపడుతోంది.
వివరాలు
ట్రేడ్ డెఫిసిట్ తగ్గించాలన్న లక్ష్యం విఫలం
ట్రంప్ ఉద్దేశించిన ట్రేడ్ డెఫిసిట్ తగ్గించాలన్న లక్ష్యం కూడా ఈ టారిఫ్‌ల వల్ల విఫలమవుతోంది. కంపెనీలు ముందుగానే సరుకులు దిగుమతి చేసుకుంటున్న కారణంగా US దిగుమతులు పెరిగిపోయాయి, కానీ ఎగుమతులు మాత్రం తక్కువగానే ఉన్నాయి. దీంతో ట్రేడ్ డెఫిసిట్ మరింత పెరిగిపోయింది. అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ కూడా ఇదే హెచ్చరిక ఇచ్చింది.. ఈ విధంగా టారిఫ్‌లు కొనసాగితే,అమెరికా ఆర్థిక వ్యవస్థ తన యథేచ్ఛ వృద్ధిని కోల్పోతుందంటూ హెచ్చరించింది. టారిఫ్‌ల వల్ల వచ్చే ఆదాయం తాత్కాలికమే కానీ, ట్రంప్ వేసిన టాక్స్ కట్స్ వల్ల ప్రభుత్వానికి దీర్ఘకాలికంగా ఆదాయం కోతే ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.
వివరాలు
భారతదేశంపై నేరుగా ప్రభావం - ట్రేడ్ సంబంధాల్లో ఉద్రిక్తత
ఇంతలో భారత్ మీద కూడా ట్రంప్ 25% టారిఫ్ విధించడం,రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాల్లో ఉద్రిక్తతను పెంచుతోంది. పైగా ట్రంప్,రష్యా నుంచి ఆయిల్,ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాలకు శిక్షలు విధిస్తామన్న హెచ్చరికలు కూడా భారత్‌ను కలవరపెట్టే అంశంగా మారాయి. భారత ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ.. "ఈ నిర్ణయం ప్రభావాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని తెలిపింది.అమెరికాతో సరైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెప్పింది.అయితే, ఇది వర్తిస్తున్న వ్యాపార చర్చలపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని,అవసరమైతే ప్రతీకార టారిఫ్‌లు కూడా విధించవచ్చని భారత అధికారి వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు,అమెరికా ఒకవైపు చైనా మీద భారత్ మద్దతు కోరుతూ, మరోవైపు భారత ఎగుమతులపై దెబ్బకొట్టే విధంగా వ్యవహరించడం, వైదేశిక విధానంలో ద్వంద్వ వైఖరిగా భావించబడుతోంది.