కెనడాలో భారత విద్యార్థుల నిరసన.. 700 మందికి ఫేక్ లెటర్లిచ్చిన ఏజెంట్
విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే ఆకాంక్షతో లక్షల ఖర్చులకు వెనుకాడకుండా బ్యాంకులో రుణమో, అప్పో సొప్పో చేసి దాదాపుగా 700 మంది భారత విద్యార్థులు కెనడాకు తరలివెళ్లారు. ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కిన వారికి అక్కడికి వెళ్లాక తెలిసింది తాము ఏజెంట్ చేతిలో అడ్డంగా మోసపోయామని. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన ఓ ఏజెంట్ సదరు విద్యార్థులకు నకిలీ ఆఫర్ లెటర్లను అందించాడు. దీని కారణంగా కెనడా అధికారులు బాధిత విద్యార్థులను వెనక్కి వెళ్లాలని ఆదేశించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఈ స్టూడెంట్స్ కి ఏం చేయాలో తోచక, టొరంటోలోని మిస్సిసాగా కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ కాన్ఫరెన్స్ సెంటర్ వద్ద మే 29 నుంచి నిరసన చేస్తూనే ఉన్నారు.
స్వదేశం బాట పడుతున్న భారత విద్యార్థులు
భారత విద్యార్థులు కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ సీన్ ఫ్రాసెర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి, బాధితులకు న్యాయం చేస్తామని మాటిచ్చినట్టు సమాచారం. అయితే విద్యార్థులు తీసుకెళ్లిన ఆఫర్ లెటర్లను అక్కడి విద్యాసంస్థలు నకిలీవిగా గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఏ సదరు స్టూడెంట్స్ కి బహిష్కరణ లేఖలను అందజేసింది. ఈ క్రమంలో భారత విద్యార్థులను స్వదేశానికి పంపించేందుకు కెనడా సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఫలితంగా కొందరు విద్యార్థులు ఇప్పటికే భారత్ చేరుకోగా, విద్యార్థులకు నకిలీ ఆఫర్ లెటర్లు అందించి దారుణంగా మోసం చేసిన ఓవర్సీస్ ఎడ్యూకేషన్ కన్సల్టెంట్ బ్రిజేశ్ మిశ్రా పరారీలో ఉన్నట్టు వినికిడి. మరోపక్క నిందితుడి కోసం పంజాబ్ పోలీసులు ముమ్ముర గాలిస్తున్నారు.