Ohio: అమెరికాలోని భారతీయ డాక్టరల్ విద్యార్థి దారుణ హత్య.. కారులో ఉండగా తుపాకీతో కాల్పులు
అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో మెడికల్ స్కూల్‌లో మాలిక్యులర్, డెవలప్‌మెంటల్ బయాలజీలో పీహెచ్‌డీ చేస్తున్న ఆదిత్యపై నవంబర్ 8న హత్యాయత్నం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులకు గోడకు గుద్దుకున్న కారులో ఆదిత్య విగతజీవిగా కనిపించాడు. సంఘటన స్థలంలో కారుపై పలుమార్లు కాల్పులు జరిగినట్టు గుర్తించిన పోలీసులు కారు కిటికీ అద్దానికి మూడు బుల్లెట్ రంధ్రాలు కూడా గుర్తించారు. పోలీసులు వెంటనే అతనిని చికిత్స నిమిత్తం UC మెడికల్ సెంటర్‌కి తరలించారు. నవంబర్ 18న అతను మరణించాడు.
అల్సరేటివ్ కోలైటిస్‌పై పరిశోధన
అతని మరణ విషయం తెలిసిన యూనివర్సిటీ వర్గాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. ఆదిత్య ఎంతో తెలివిగలవాడని కాలేజీ డీన్ విచారం వ్యక్తం చేశారు. ఆదిత్య నాల్గవ సంవత్సరం డాక్టరల్ విద్యార్థి, అల్సరేటివ్ కోలైటిస్‌పై పరిశోధన చేస్తున్నాడు. అతను దిల్లీ విశ్వవిద్యాలయంలోని రాంజాస్ కళాశాల నుండి జంతుశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. ఆదిత్యకు గతేడాది స్కాలర్‌షిప్ కూడా లభించింది. 2025లో అతడి పీహెచ్‌డీ పూర్తవ్వాల్సి ఉండగా ఇంతలోనే దారుణం జరిగిపోయింది.