China: చైనాలో అంతుచిక్కని న్యుమోనియా.. మరో మహమ్మారి రాబోతుందా?
చైనాలో వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు అంతుచిక్కని న్యుమోనియా ప్రబలుతోంది. ఈ క్రమంలోనే డ్రాగన్ దేశం కలవరపడుతోంది. న్యుమోనియా లక్షణాలతో అక్కడి చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం చిన్నారుల ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకున్న కొవిడ్ (Covid) వైరస్ చైనా నుంచే వ్యాప్తి చెందింది. ఇప్పుడు మరో ప్రాణంతక వ్యాధి చైనాతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తోంది. పాఠశాలలకు వెళ్తున్న చిన్నారులు అంతుచిక్కని న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి చెందకుండా పాఠశాలలు తాత్కాలికంగా మూసివేశారని ప్రోమెడ్ సంస్థ వెల్లడించింది.
వ్యాధి ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఏకకాలంలో వందలాదిగా పిల్లలు అనారోగ్యానికి గురికావడం మాములు విషయం కాదని ఆ సంస్థ తెలిపింది. అసలు ఈ జబ్బు ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కాకపోయినా, పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని వైద్య నిపుణులు, సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు ఉపాధ్యాయులు కూడా ఈ మహమ్మారి బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో చైనా కరోనా నిబంధనలను ఎత్తివేసిందని, అప్పటి నుంచి తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ప్రోమెడ్ ప్రతినిధులు అన్నారు. వ్యాధిపై పూర్తి వివరాలు అడిగిన WHO : ఉత్తర చైనాలో న్యుమోనియా లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరడంపై WHO (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలివ్వాలని చైనాను కోరింది.