అబ్దుల్ రెహ్మాన్ మక్కీ: 'అల్-ఖైదాతో సంబంధాలు లేవు, బిన్ లాడెన్‌ను ఎప్పుడూ కలవలేదు'
ఐఎస్‌ఐఎల్ (దాయిష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి భద్రతామండలి(యూఎన్ఎస్సీ) ఇటీవల గుర్తించింది. అయితే దీనిపై తాజాగా అబ్దుల్ రెహ్మాన్ మక్కీ స్పందించారు. అల్-ఖైదాతో గాని, ఇస్లామిక్ స్టేట్‌తో గాని తనకు ఎలాంటి సంబంధం లేదని మక్కీ చెప్పారు. ఈ మేరకు ఒక వీడియోలో విడుదల చేశారు. భారత ప్రభుత్వం మత విశ్వాసాలు, తప్పు నివేదికల ఆధారంగా తనను గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని మక్కీ ఆరోపించారు. తాను ఒసామా బిన్ లాడెన్, ఐమన్ అల్-జవహిరి, అబ్దుల్లా అజామ్‌లను ఎప్పూడూ కలవలేదని ఆ వీడియోలో చెప్పారు.
2019 నుంచి పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న మక్కీ
మక్కీని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటనించిన తర్వాత అతని ఆస్తులు స్తంభించిపోయాయి. ప్రయాణాలపై నిషేధం మొదలైంది. ఈ క్రమంలో వీడియో ద్వారా మక్కీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ వీడియోలో 166 మందిని బలిగొన్న ముంబయి ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ బావ గురించి కానీ, ఆ దాడుల గురించి కానీ మక్కీ స్పందించలేదు. టెర్రర్ ఫైనాన్స్ కేసుల్లో 2019 నుంచి మక్కీ పాకిస్థాన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. హఫీజ్ సయీద్‌తోపాటు మరికొందరు ఎల్ఈటీ, జేయూడీ నాయకులతో కలిసి ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు.