Page Loader
All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌
ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌

All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆ అశాంతిని భారత్‌పైకి మళ్లిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాలను వివిధ విదేశాలకు పంపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), జపాన్‌కు వెళ్లిన బృందాలు, పాకిస్థాన్ చేస్తున్న దుష్టచర్యలు, అలాగే భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) గురించి అక్కడి నాయకులకు వివరించడంలో నిమగ్నమయ్యాయి. ఈ నేపథ్యంలో, ఆ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల ప్రకారం, భారత్‌కు అక్కడి ప్రభుత్వాల నుండి పూర్తి మద్దతు లభిస్తోంది.

వివరాలు 

ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా దాన్ని తుడిచివేయాలి 

శివసేన ఎంపీ శ్రీకాంత్ శిండే నేతృత్వంలోని అఖిలపక్ష బృందం యూఏఈ పర్యటనలో భాగంగా, అక్కడి మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రముఖులు, చింతనకర్తలతో పలుసార్లు సమావేశమైంది. ఇప్పటికే రెండు ముఖ్య సమావేశాల్లో పాల్గొన్న ఈ బృందం, పాకిస్థాన్‌ కారణంగా ఎదురవుతున్న ఉగ్ర ముప్పు, ఆపరేషన్ సిందూర్‌ వంటి భారత చర్యల వివరాలను వారికి తెలియజేసింది. యూఏఈ అధికారులు ఈ సందర్భంగా స్పందిస్తూ, ఉగ్రవాదం ఎలాంటి రూపంలో ఉన్నా దాన్ని తుడిచివేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే, భారత్‌ తీసుకుంటున్న దౌత్యపరమైన చర్యలకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

వివరాలు 

ఉగ్రవాదంపై పోరాటానికి జపాన్ అండగా నిలుస్తుంది 

ఇక జెడీయూ ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలో జపాన్‌ను సందర్శిస్తున్న మరో అఖిలపక్ష బృందం, అక్కడి నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్‌ తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం అన్నరు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారిని తప్పక శిక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటానికి తమ దేశం అండగా నిలుస్తుందని జపాన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది.