'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు
అమెరికాలోని టెక్సాస్, వాషింగ్టన్‌లోని ఫెడరల్ న్యాయమూర్తులు 'అబార్షన్ మాత్ర'పై శుక్రవారం ఒకేరోజు భిన్న తీర్పులు ఇవ్వడం సంచలనంగా మారింది. ఇది గర్భస్రావంతో పాటు సాధారణంగా ఉపయోగించే అబార్షన్ మాత్ర 'మిఫెప్రిస్టోన్' వినియోగంపై అమెరికాలో జరుగుతున్న పోరాటాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి. అమెరికా సుప్రంకోర్టు 2022లో అబార్షన్ హక్కును రద్దు చేస్తూ సంచలనాత్మ తీర్పు చెప్పింది. అనంతరం అబార్షన్ హక్కు పునరుద్ధరణ కోసం అప్పటి నుంచి న్యాయపారాటాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాలు తమకు ఉన్న అధికారాల పరిధి మేరకు అబార్షన్ మాత్రలను విక్రయించేందుకు అనుమతించాయి.
కోర్టులు ఇచ్చిన తీర్పులు ఇలా ఉన్నాయి.
ఒక కేసు తీర్పులో భాగంగా శుక్రవారం టెక్సాస్‌లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి అబార్షన్ పిల్ 'మిఫెప్రిస్టోన్'కు సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదాన్ని నిలిపివేసారు. 'మిఫెప్రిస్టోన్' తయారీదారు కోర్టు తీర్పుపై తిరిగి అప్పీల్ చేసుకోవడానికి న్యాయమూర్తి వారం రోజుల సమయం ఇచ్చారు. వేరే కేసులో విచారణ సందర్భంగా శుక్రవారం రాత్రి వాషింగ్టన్ రాష్ట్రంలోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి టెక్సాస్ కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తీర్పు చెప్పారు. ఎఫ్‌డీఏ తప్పనిసరిగా అబార్షన్ మాత్ర 'మిఫెప్రిస్టోన్'ను కనీసం 12 లిబరల్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
అమెరికాలో అబార్షన్ కోసం ఏ మాత్రలు వినియోగిస్తారు?
ఒక మహిళ తాను గర్భవతి అని నిర్ధారించున్న తర్వాత అబార్షన్‌ను ప్రేరేపించడానికి పిల్ తీసుకుంటారు. అబార్షన్ కోసం మహిళలు అమెరికాలో ఒకటి కంటే ఎక్కువ మాత్రలను తీసుకుంటున్నారు. ఆ మాత్రలను మిఫెప్రిస్టోన్, మిసోప్రోస్టోల్ అని పిలుస్తారు. మొదట మిఫెప్రిస్టోన్ పిల్ వేసుకుంటారు. ఇది ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. తద్వారా గర్భం ఎదగకుండా అక్కడితో ఆపేస్తుంది. 48 గంటల తర్వాత మిసోప్రోస్టోల్ ఔషధాన్ని తీసుకుంటారు. ఇది రక్తస్రావం ద్వారా గర్భాశయాన్ని ఖాళీ చేస్తుంది. 2020లో యునైటెడ్ స్టేట్స్‌లో 930,160 అబార్షన్‌లలో 53 శాతం ఈ మాత్రల ద్వారానే జరిగినట్లు గట్‌మాచర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక చెప్పింది.