స్లీప్ ఆప్నియాతో బాధపడుతున్న బైడెన్.. యంత్రం సాయంతో నిద్రిస్తున్న అమెరికా అధ్యక్షుడు
అగ్రరాజ్యం అమెరికా అంటే ప్రపంచ దేశాలనే శాసించగల సామర్థ్యం ఉన్న శక్తిమంతమైన దేశం. అలాంటి దేశానికి అధ్యక్షుడైన వ్యక్తిని పరిపాలనా పరంగా ఎంతో శక్తిమంతుడిగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి. కానీ తాజాగా యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ గురించి విస్తుబోయే విషయం ఒకటి బహిర్గతమైంది. తమ దేశాధినేత స్లీపింగ్ సమస్యతో బాధపడుతున్నారని వైట్ హౌజ్ వెల్లడించింది. నిద్రపోయే క్రమంలో బైడెన్ ఓ యంత్రాన్ని సైతం ఉపయోగిస్తారని వివరించింది. గత కొద్ది రోజులుగా కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్ (సీప్యాప్) యంత్రాన్ని వినియోగిస్తున్నారని వైట్‌హౌస్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఓ మోటార్ సాయంతో గాలిని శ్వాసనాళాల్లోకి పంపిస్తుంది. శ్వేతసౌధం నుంచి బైడెన్ బయటకు వచ్చాక ముఖంపై గీతలు కనిపించడాన్ని శ్వేతసౌధం భద్రతా విభాగాలు గుర్తించాయి.
అమెరికాలో దాదాపు 3 కోట్ల మంది స్లీప్ ఆప్నియా బాధితులు
2008 నుంచి స్లీప్ ఆప్నియా సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. నిద్ర సమయంలో గాలి పీల్చుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందినే స్లీప్ ఆప్నియా అంటారు. చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. దీని బారిన పడ్డవారు రాత్రంతా నిద్రించినా ఉదయం మళ్లీ అలసిపోయినట్టే కనిపిస్తారు. అమెరికాలో దాదాపు 3 కోట్ల మంది దీని వల్ల ఇబ్బంది పడుతున్నట్లు అంచనా. దీంతో పాటు గురక సమస్య కూడా ఉంటుంది. ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడూ ఆప్నియాతో హృదయ స్పందనల్లో సమస్యలు వచ్చినట్టు వైద్యులు తేల్చారు. తాజాగా మరోసారి ఆ సమస్య బయటపడింది. 80 ఏళ్లున్న బైడెన్ అధ్యక్ష పదవి కోసం మరోసారి పోటీచేయనున్నారు. అయితే అమెరికా దేశాధినేతగా, అత్యున్నత పదవిని చేపట్టిన అతిపెద్ద వయస్సు గల వ్యక్తిగా బైడెన్ రికార్డులకెక్కారు.