
Earthquake: మయన్మార్‌లో మరోసారి భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
ఈ వార్తాకథనం ఏంటి
మయన్మార్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.1గా నమోదైంది.
భూకంపం నేపథ్యంలో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం ఆదివారం మయన్మార్‌లోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే సమీపంలో ఈ ప్రకంపనలు సంభవించాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు వెంటనే స్పందించి, చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
అయితే శుక్రవారం సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయని స్థానిక అధికారులు వెల్లడించారు.
శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
Details
1600 మందికి పైగా మృతి
ఈ విపత్తులో 1,600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు. శిథిలాలను తొలగించేకొద్దీ మృతుల సంఖ్య మరింత పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం 11.53 గంటలకు 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో, 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి.
తాజా భూకంపంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగింది. భూకంప ప్రభావం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ వరకూ చేరింది.
అక్కడ నిర్మాణంలో ఉన్న ఆకాశహర్మ్యం కుప్పకూలడంతో, అక్కడ పనిచేస్తున్న 78 మంది కార్మికుల జాడ ఇంకా తెలియరాలేదు.
అలాగే భూకంపం కారణంగా నగరంలో మరణించిన మరో 10 మందిని శనివారం గుర్తించారు. భారీ శిథిలాలను తొలగించేందుకు శక్తిమంతమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు.