Bangladesh New Government: నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు.. అయన నేపథ్యం ఇదే ..
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసన సోమవారం నిర్ణయాత్మక మలుపు తీసుకుంది. వేలాది మంది ఆందోళనకారులు ప్రధాని నివాసంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పడం చూసి ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. దేశంలో తిరుగుబాటు జరిగింది. ఇంతలో సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ ను దేశ కొత్త ప్రధానిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. నిరసనకారుల దూకుడును చూసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ఢాకాలో ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపడుతుందని ప్రకటించారు.
మహమ్మద్ యూనస్ నేపథ్యం ఇదే ..
మొహమ్మద్ యూనస్ జూన్ 28, 1940 న జన్మించాడు. అయన ఒక సామాజిక వ్యవస్థాపకుడు, బ్యాంకర్, ఆర్థికవేత్త, పౌర సమాజ నాయకుడు. 2006లో, అయన గ్రామీణ బ్యాంకును స్థాపించాడు. మైక్రోక్రెడిట్, మైక్రోఫైనాన్స్ ఆలోచనలను కనుగొన్నాడు. దీని కోసం ఆయనకి 2006లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. మైక్రో క్రెడిట్ ద్వారా దిగువ స్థాయి నుండి ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సృష్టించేందుకు చేసిన కృషికి యూనస్ కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2009లో, అయనకి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం లభించింది. 2010లో కాంగ్రెస్ గోల్డ్ మెడల్ లభించింది. దీనితో పాటు మరెన్నో అవార్డులు కూడా అందుకున్నారు.
గ్రామీణ బ్యాంకును స్థాపించారు
1961 నుండి 1965 వరకు, అయన బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించాడు. వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. బంగ్లాదేశ్‌లో అయన గ్రామీణ బ్యాంకును స్థాపించాడు. సూక్ష్మ రుణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాడు. 18 ఫిబ్రవరి 2007న మహ్మద్ యూనస్ నాగ్రిక్ శక్తి అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. కార్మిక చట్ట ఉల్లంఘన ఆరోపణలపై బంగ్లాదేశ్ కోర్టు మహ్మద్ యూనస్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది.
గ్లాస్గో కలెడోనియన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్
2011లో యూనస్ సోషల్ బిజినెస్ - గ్లోబల్ ఇనిషియేటివ్‌లను సాస్కియా బ్రూస్టెన్, సోఫీ ఐసెన్‌మాన్, హన్స్ రీట్జ్‌లతో కలిసి స్థాపించారు. 2012లో స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కలెడోనియన్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. ఆయన 2018 వరకు ఈ పదవిలో కొనసాగారు. 1998 నుండి 2021 వరకు, అయన ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్ డైరెక్టర్ల బోర్డు సభ్యునిగా కూడా పనిచేశాడు.