Page Loader
Donald Trump: బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం.. ప్రపంచమంతా వచ్చి అమెరికాలో ఎగబడితే ఎలా?: ట్రంప్‌
బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం.. ప్రపంచమంతా వచ్చి అమెరికాలో ఎగబడితే ఎలా?: ట్రంప్‌

Donald Trump: బానిసల పిల్లల కోసమే జన్మతః పౌరసత్వం.. ప్రపంచమంతా వచ్చి అమెరికాలో ఎగబడితే ఎలా?: ట్రంప్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో ముఖ్యమైన ఒకటి జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేయడమే. అయితే, ఇది వివాదాస్పదంగా మారడంతో న్యాయస్థానం ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, ట్రంప్ తాజాగా స్పందిస్తూ, జన్మతః పౌరసత్వాన్ని ప్రారంభంలో బానిసల పిల్లల కోసమే తీసుకొచ్చారని పేర్కొన్నారు.

వివరాలు 

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: ట్రంప్ 

''చరిత్రను పరిశీలిస్తే, బానిసల సంతతికి హక్కులను కల్పించాలనే ఉద్దేశంతోనే జన్మతః పౌరసత్వాన్ని ఆమోదించారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అమెరికాకు వచ్చి ఇక్కడ స్థిరపడేందుకు ఈ చట్టాన్ని రూపొందించలేదు. ప్రస్తుతం అనర్హులైన వ్యక్తులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, దాని ఫలితంగా అర్హత లేని పిల్లలకు పౌరసత్వం లభిస్తోంది. అసలు ఈ చట్టం అలా వినియోగించుకోవటానికి కాదు. ఇది బానిసల వారసుల కోసం గొప్ప లక్ష్యంతో రూపొందించబడింది'' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ విషయంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు.

వివరాలు 

దావా వేసిన 22డెమోక్రాట్లు పాలిత రాష్ట్రాలు

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం, తల్లిదండ్రుల వలస స్థితి ఎలా ఉన్నా, అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించేలా నిబంధనలు ఉన్నాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే ట్రంప్ ఈ హక్కును రద్దు చేయడానికి కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డెమోక్రాట్లు పాలిత 22 రాష్ట్రాలు ఐదు దావాలను దాఖలు చేశాయి. ఇటీవల సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు ఈ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, వాటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.