
Trump Tariffs:'బ్రిక్స్ ఘర్షణను కోరుకోవడం లేదు': ట్రంప్ అదనపు 10% సుంకం బెదిరింపుపై చైనా స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని చేసిన ప్రకటనకు చైనా స్పందించింది. బ్రిక్స్ దేశాలు విభేదాలను కోరుకోవడం లేదని స్పష్టంచేసింది. "టారిఫ్ విధానాలపై మా నిబద్ధతలో ఎలాంటి మార్పు లేదు.సుంకాల యుద్ధాల్లో ఎవరూ విజేతలు కాలేరు. రక్షణాత్మక ధోరణితో మేము ముందుకు సాగలేం"అని చైనా మరోసారి పునరుద్ఘాటించింది. బ్రెజిల్‌లో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. "అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు ఇచ్చే ఏ దేశానికైనా అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు"అని ఆయన స్పష్టం చేశారు. ఈసమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక దేశాధినేతలు, ప్రతినిధులు పాల్గొన్న సంగతి తెలిసిందే.
వివరాలు
అమెరికా-చైనా మధ్య ట్రేడ్ డీల్
వారిలో కొంతమంది అమెరికా విధానాలను విమర్శిస్తూ వాణిజ్య సుంకాల అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. వాణిజ్య సుంకాల విషయంలో ట్రంప్ గతంలో నుంచే కఠిన వైఖరిని తీసుకున్న విషయం తెలిసిందే. ఓ సమయంలో అమెరికా-చైనా మధ్య ఈ అంశంపై ఘర్షణ కూడా జరిగింది. తరువాత, ఈ రెండు ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో ఈ వివాదం కొంతమేర చల్లబడింది. ఇకపోతే.. గతంలో ట్రంప్ బ్రిక్స్ దేశాలకు గట్టి హెచ్చరికలు చేసిన సందర్భం కూడా ఉంది. డాలర్‌పై ప్రభావం చూపేలా బ్రిక్స్ దేశాలు వ్యవహరిస్తే, తమ వాణిజ్యంతో వారికి కౌంటర్ ఇస్తామని హెచ్చరించారు.
వివరాలు
అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా చర్యలు తీసుకుంటే..
"బ్రిక్స్ ఒక ప్రమాదకరమైన ప్రతిపాదన తీసుకొచ్చింది. చాలామందికి ఇది ఇష్టం లేదు. ఇప్పుడు దానిపై చర్చించడానికే వారు వెనుకాడుతున్నారు. డాలర్‌ను టార్గెట్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటానన్న నా హెచ్చరిక వల్ల వారు వెనుకడారు. అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా చర్యలు తీసుకుంటే, వారి దిగుమతులపై 100 శాతం టారిఫ్‌లు విధిస్తా. వారు టారిఫ్‌లకు వ్యతిరేకంగా నన్ను ఆశ్రయించి వేడుకోక తప్పదు. నా హెచ్చరికలతో బ్రిక్స్ దెబ్బతింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలుగా తొలుత బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నా, ఆ తర్వాత ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి దేశాలు కూడా ఈ కూటమిలో చేరిన విషయం విదితమే.