Page Loader
Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్ 
ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్

Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2025
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ఉక్రెయిన్‌ భారీ స్థాయిలో డ్రోన్లతో రష్యా వైమానిక స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో మాస్కోకు చెందిన 41 యుద్ధ విమానాలు నాశనమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రిటన్‌ ఉక్రెయిన్‌కు భారీ డ్రోన్‌ మద్దతును ప్రకటించింది. 2026 ఏప్రిల్ నాటికి లక్ష డ్రోన్లను ఉక్రెయిన్‌కు అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఈ డ్రోన్‌ల విలువ దాదాపు 350 మిలియన్‌ పౌండ్లుగా ఉండగా, ఇది మొత్తం 4.5 బిలియన్‌ పౌండ్ల సైనిక మద్దతులో ఒక భాగంగా పేర్కొంది. ఈ చర్యలు స్వతంత్రంగా రూపొందించిన స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించిన తరువాత చేపట్టారు. రష్యా దాడులతో పాటు, భవిష్యత్తులో ఎదురయ్యే మిగతా ముప్పులను తట్టుకునేందుకు ఉక్రెయిన్‌కు సాయంగా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశం.

వివరాలు 

మోట్‌ ఆధారిత డ్రోన్లను అభివృద్ధి చేసిన ఉక్రెయిన్‌

బ్రస్సెల్స్‌లో నిర్వహించనున్న 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్‌ రక్షణ మంత్రిగా ఉన్న జాన్ హీలీ ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. రష్యా వద్ద అపారమైన క్షిపణి నిల్వలు ఉన్నాయి. దీనికి భిన్నంగా, ఉక్రెయిన్‌ దగ్గర అధునాతన ఆయుధాలు, ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థల కొరత స్పష్టంగా ఉంది. ఈ కారణంగా రష్యా చేపడుతున్న క్షిపణి, డ్రోన్‌ దాడులకు ఎదురు నిలవలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో, అధిక దూరాన్ని చేరగలిగే రిమోట్‌ ఆధారిత డ్రోన్లను ఉక్రెయిన్‌ అభివృద్ధి చేసింది. వీటితో ఇటీవల రష్యాలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర దాడులకు దిగింది.

వివరాలు 

మిత్రదేశాల నుంచి సహాయం కోరుతున్న ఉక్రెయిన్ 

ఇంతకుముందు కూడా ఉక్రెయిన్‌ ఈ డ్రోన్లను రష్యా సైనిక స్థావరాలు, చమురు నిల్వలపై దాడుల కోసం వినియోగించింది. రష్యా ఆక్రమణలకు ఎదురుగా నిలవాలంటే మరింత డ్రోన్‌ మద్దతు అవసరమని భావించిన కీవ్‌, మిత్రదేశాల నుంచి సహాయం కోరుతోంది. మాస్కో అనుసరిస్తున్న తీవ్ర దాడులను ఎదుర్కొనేందుకు బ్రిటన్‌, అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందజేస్తున్నాయి. ఇటీవలి పరిణామాల్లో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌పై విధించిన దీర్ఘశ్రేణి ఆయుధాల ఆంక్షలను సడలించాయి. దాంతో కీవ్‌కు ఇప్పుడు ఈ ఆయుధాలను వినియోగించే అవకాశాలు పెరిగాయి. ఈ చర్యలు రష్యా దాడులకు తగిన ప్రతిఘాతాన్ని ఇవ్వడానికే కాకుండా, భవిష్యత్తులో సైతం సుదీర్ఘకాలిక రక్షణ కోసం కీలకంగా నిలుస్తాయని అంచనా.