
India-Canada: మా ఎన్నికల్లో భారతదేశం జోక్యం చేసుకునే అవకాశం.. కెనడా గూఢచారి సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-కెనడాల మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న సందర్భంలో,ఒట్టావా మరోసారి న్యూదిల్లీపై ఆరోపణలు చేసింది.
త్వరలో కెనడాలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో (Elections in Canada) భారత్, చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆ దేశ గూఢచారి సంస్థ ఆరోపించింది.
రష్యా, పాకిస్థాన్ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొచ్చని అనుమానాలను వ్యక్తం చేసింది.
కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ వానెస్సా లాయిడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
స్పందించని చైనా, భారత దౌత్య కార్యాలయాలు
"త్వరలో మా దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో విదేశీ శక్తులు జోక్యం చేసుకునేందుకు కృత్రిమ మేధస్సు (AI) సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది.చైనా (China) ప్రభుత్వం ఈ ప్రయత్నాలు చేసేందుకు అధిక అవకాశాలు ఉన్నాయి.భారత ప్రభుత్వానికి (Indian Govt)కూడా ఆ సామర్థ్యం, ఉద్దేశం ఉంది" అని లాయిడ్ ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలపై ఒట్టావాలోని చైనీస్, భారత దౌత్య కార్యాలయాలు ఇంకా స్పందించలేదు.
ఇంతకుముందు కూడా కెనడా ఇలాంటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కెనడా (Canada) ఎన్నికల్లో విదేశీ ప్రభుత్వాల జోక్యంపై దర్యాప్తు నిమిత్తం ఆ దేశ ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
వివరాలు
ఆరోపణలను ఖండించిన భారత విదేశాంగ శాఖ
ఆ కమిషన్ ఇచ్చిన నివేదికలో న్యూదిల్లీపై తీవ్ర ఆరోపణలు చేసింది. "ఫెడరల్ ఎన్నికల్లో పోటీ చేసిన మూడు రాజకీయ పార్టీల నాయకులకు భారత ప్రభుత్వం (Indian Government) ప్రాక్సీ ఏజెంట్ల ద్వారా రహస్యంగా ఆర్థిక సాయం అందించినట్లు సమాచారం ఉంది" అని కెనడియన్ కమిషన్ పేర్కొంది.
అయితే, భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది.
నిజానికి, భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడానే జోక్యం చేసుకుంటోందని, దీని వల్ల మన దేశంలో అక్రమ వలసలు, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని మండిపడింది.
వివరాలు
జస్టిన్ ట్రూడో ఆరోపణలు
2023 జూన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ కెనడాలో హత్యకు గురైన విషయం తెలిసిందే.
ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఈ ఆరోపణలను న్యూదిల్లీ తీవ్రంగా ఖండించింది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగానే, కెనడా పదేపదే న్యూదిల్లీపై ఆరోపణలు చేస్తూనే ఉంది.
ఇక, కెనడా నూతన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన మార్క్ కార్నీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 28న కెనడాలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.