
USA-China: అమెరికా విధించిన సుంకాలపై వాణిజ్య చర్చలు లేవ్.. ట్రంప్ మాటలు ఉత్తివే: చైనా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా 145 శాతం టారిఫ్‌లు చైనా ఉత్పత్తులపై విధించడంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది.
ఈ నేపథ్యంలో చైనాతో సుంకాలపై చర్చలు సజావుగా కొనసాగుతున్నాయని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలను చైనా తిప్పికొట్టింది. ప్రస్తుతం అమెరికాతో తమకు ఎలాంటి వాణిజ్య చర్చలు జరగడం లేదని బీజింగ్ స్పష్టం చేసింది.
ఈ విషయంలో చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి గువో జియాకున్ స్పందిస్తూ,"చైనా-అమెరికాల మధ్య వాణిజ్య సంబంధిత చర్చల కోసం ఎలాంటి సంప్రదింపులు జరగడం లేదు. ఈ సమయంలో మేము ఎలాంటి వాణిజ్య ఒప్పందానికి రాలేదు. చర్చల పరిస్థితి లేదు" అని స్పష్టం చేశారు.
వివరాలు
ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరం
అయితే,సుంకాలపై చర్చలకు మాత్రం తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.కానీ ఆ చర్చలు పరస్పర గౌరవం,సమాన స్థాయిలోనే సాగాలని స్పష్టం చేశారు.
ఇక ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి.చైనా నుండి దిగుమతి చేసే వస్తువులపై సుంకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అన్నారు.
అయితే పూర్తిగా సున్నా టారిఫ్‌కి చేరకపోవచ్చని కూడా పేర్కొన్నారు.
భవిష్యత్తులో చైనాతో స్నేహపూర్వక వాణిజ్య సంబంధాలను కొనసాగించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ప్రస్తుతం చైనా-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సాఫీగా సాగుతున్నాయని అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి దేశం అమెరికా మార్కెట్‌లో నిలదొక్కుకోవాలనుకుంటోందని తెలిపారు.
చైనాతో వాణిజ్యఒప్పందం కుదిరే రోజు కోసం తాము ఎదురుచూస్తున్నామని తెలిపారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల పైనే చైనా అధికారికంగా స్పందించింది.
వివరాలు
రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు
ఇక ప్రపంచ దేశాలపై సుంకాల విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పైనా కఠినమైన ఆర్థిక చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించగా, ఇందుకు ప్రతిస్పందనగా చైనా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది.
ఈ చర్యలతో రెండు దేశాల మధ్య వాణిజ్య పోరు మరింత తీవ్రమవుతోంది.