CIA: ఉత్తర కొరియా,ఇరాన్, చైనాలో ఇన్‌ఫార్మర్ల కోసం ప్రకటన జారీ చేసిన సీఐఏ
తమ ప్రత్యర్థి దేశాల నుండి సమాచారాన్ని సేకరించేవారి కోసం అమెరికా నిఘా సంస్థ సీఐఏ విడుదల చేసిన సోషల్ మీడియా ప్రకటన సంచలనంగా మారింది. ఈ ప్రకటన ద్వారా చైనా, ఉత్తర కొరియా, ఇరాన్‌ల నుండి ఇన్ఫార్మర్లను నియమించడానికి చర్యలు చేపట్టింది. మాండరీన్, ఫార్సీ, కొరియా భాషల్లో ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, లింక్డిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్టు చేసింది. తమను రహస్యంగా ఎలా సంప్రదించాలనే దానిపై కూడా స్పష్టమైన సమాచారం అందించింది. ఆసక్తికరంగా, డార్క్‌వెబ్‌లో కూడా ఈ ప్రకటన వెలువడినట్లు గమనించవచ్చు. వీపీఎన్, టోర్ నెట్‌వర్క్‌లను ఉపయోగించి తమ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించింది.
వీపీఎన్‌లు వాడద్దని హెచ్చరిక
అయితే, ఆయా దేశాలలో పనిచేస్తున్న వీపీఎన్‌లను మాత్రం వాడవద్దని హెచ్చరించింది. సియోల్‌లోని హాంకాక్ యూనివర్శిటీ ఆఫ్ ఫారెన్ సర్వీస్ ప్రొఫెసర్ మాసొన్ రిచీ ప్రకారం, ఇలాంటి వ్యూహం రష్యాలో ఇన్ఫార్మర్ల నియామకంలో విజయం సాధించిందని తెలిపారు. ఇతర నియంతృత్వ పాలనలలో ఉన్న వ్యక్తులతో కూడా వ్యవహరించడానికి సీఐఏ సిద్ధంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, ఉత్తర కొరియాలో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతం అవుతుందో చెప్పలేమన్నారు.
వ్యాపారం చేస్తున్న వ్యక్తులే లక్ష్యం
ముఖ్యంగా, చైనాలో వ్యాపారం చేస్తున్న ఉత్తర కొరియా వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేశారు. సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ ప్రకారం, చైనాలో జిన్‌పింగ్ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం తెలిసినవారు అనేక మంది ఉన్నారని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారు తమను సంప్రదించవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, చైనా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ దేశాలు అమెరికా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్‌లను ఇప్పటికే నిషేధించిన విషయం గమనించదగినది.