లక్ష మంది లోపే జనాభా ఉన్న ఈ దేశాల గురించి తెలుసా?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది. ఇటీవల చైనాను అధిగమించి 142.86కోట్ల జనాభాతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అయితే ప్రపంచంలో లక్ష జనాభా కూడా లేని కొన్ని దేశాలు ఉన్నాయి. అంతేకాదు ఆ దేశాల్లో సకల సౌకర్యాలు ఉండటం గమనార్హం. ఆ దేశాలెంటో ఒకసారి తెలుసుకుందాం. వాటికన్ సిటీ: ప్రపంచంలోనే చిన్న దేశం వాటికన్ సిటీ. ఇక్కడ జనాభా 518మంది మాత్రమే. వాటికన్ సిటీ వైశాల్యం చదరపు కిలోమీటరు కంటే తక్కువే. ఇక్కడ మత ప్రచారకులు, సన్యాసినులు కనిపిస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ నగరంలో ఒక చౌరస్తాలో దాదాపు 80వేల మంది కూర్చోవచ్చు. ఇక్కడ నివసించే పోప్ సందేశాన్ని వినడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు.
టువాలు, నౌరు దేశాల్లో 13వేల మందికంటే తక్కువ జనాభా
టువాలు: దక్షిణ పసిఫిక్‌లోని బ్రిటిష్ కామన్వెల్త్‌లో గల ఒక స్వతంత్ర ద్వీప దేశం టువాలు. 11,396 మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఈ దేశం 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ నివసిస్తున్న స్థానికులు తమ పూర్వీకుల జీవనశైలిని అనుసరిస్తారు. సంస్కృతి, సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నౌరు: ద్వీప దేశం 'నౌరు' జనాభా కేవలం 12,780. ఇది 21 చదరపు కిలోమీటర్లలో ఉంది. ఇక్కడ జనాభా ప్రధాన వృతి వ్యవసాయం. పైనాపిల్, అరటి, కొబ్బరి, వివిధ కూరగాయలు సాగు చేస్తారు. ఫాస్ఫేట్ తవ్వకాల వల్ల 'నౌరు'లోని 80 శాతం భూమి నాశనమైందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పలౌ, శాన్ మారినో దేశాల్లో జనాభా
పలౌ: పసిఫిక్ ద్వీప దేశమైన పలావులో 18,058 మంది నివసిస్తున్నారు. ఈ దేశం 459 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. ఇక్కడ అందమైన ద్వీపాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. 1914 నుంచి 1944 వరకు ఈ దేశం జపాన్ పాలనలో ఉంది. తర్వాత అమెరికా చేతుల్లోకి వెళ్ళింది. పలౌ 1994లో స్వతంత్ర దేశంగా అవతరించింది. శాన్ మారినో: శాన్ మారినో ఒక చిన్న చర్చి నిర్మాణంతో నేడు దేశంగా మారింది. దీని జనాభా 33,642 మంది. ఈ దేశం 61 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడిన శాన్ మారినో ఇప్పుడు తలసరి ఆదాయంలో మంచి పురోగతి సాధించింది.
మార్షల్ దీవులు, మొనాకో, లైకెస్టీన్ దేశాల్లో జనాభా ఇలా
మొనాకో: మొనాకో అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇక్కడ 36,297 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ దేశం యొక్క వైశాల్యం 2 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ నివసిస్తున్న వారిలో 32 శాతం మంది ధనవంతులే కావడం గమనార్హం. లైకెస్టీన్: స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉండే ప్రముఖ పర్యాటక దేశం లైకెస్టీన్. ఈ దేశంలో 39,584 మంది నివసిస్తున్నారు. 160 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం అత్యధికం. ప్రధాన భాష జర్మన్. మార్షల్ దీవులు: పసిఫిక్ మహాసముద్రంలోని మైక్రోనేషియాలో ఉన్న ఒక దేశం మార్షల్ దీవులు. 41,996 మంది ఇక్కడ నివసిస్తున్నారు. విస్తీర్ణం 181 చ.కి.మీ. కోరల్ రీఫ్ దీవులు ఈ దేశానికి ప్రధాన ఆకర్షణ.
సెయింట్ కిట్స్ అండే నెవిస్, డొమినికా దేశాల్లో జనాభా
సెయింట్ కిట్స్ అండ్ నెవిస్: ఈ దేశం కరేబియన్‌లోని వెనిజులాకు ఉత్తరాన ఉంది. ఈ దేశ జనాభా 47,755 మంది. 261 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చెరకు ఇక్కడ ప్రధాన ఆహార పంట. ఈ దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. డొమినికా: ఆఫ్రికన్ వలస కార్మికులతో నిండిన ద్వీప దేశం డొమినికా. ఇక్కడ 73,040 మంది నివసిస్తున్నారు. 751 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశం అనేక వర్షారణ్యాలు, అగ్నిపర్వతాలు, కాఫీ తోటలకు నిలయంగా ఉంది.