Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం.. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పు
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యమైన అమెరికాలో అధికారం చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తన పాలనలో కీలక నిర్ణయాలతో జోరు పెంచింది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చినట్లు ట్రంప్ ప్రకటించారు.
అంతేకాకుండా అలస్కన్ శిఖరం డెనాలిని మళ్లీ మౌంట్ మెకిన్లీగా మార్చినట్లు తెలిపారు.
అధ్యక్షుడి ఆదేశాల మేరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఇప్పుడు అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారిందని అలాగే అలస్కాలో ఉన్న ఎత్తైన శిఖరం డెనాలిని మౌంట్ మెకిన్లీగా మార్చామని ట్రంప్ అంతర్గత విభాగం తన ప్రకటనలో పేర్కొంది.
ఈ మార్పులు అమెరికా అసాధారణ వారసత్వాన్ని కాపాడటంలో సహాయపడతాయని వివరించింది.
Details
విలియం మెకిన్లీ గౌరవార్థం 'మౌంట్ మెకిన్లీ'గా నామకరణం
గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మార్పుకు సంబంధించి జియోలాజికల్ సర్వేను సూచించాలనే ఆదేశాలు ట్రంప్ జారీ చేసినా అంతర్జాతీయంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు.
అలస్కాలో ఉన్న ఎత్తైన శిఖరానికి ముందు మాజీ అధ్యక్షుడు విలియం మెకిన్లీ గౌరవార్థం 'మౌంట్ మెకిన్లీ' అని పేరు పెట్టారు.
ఆ తర్వాత 1975లో స్థానిక అభ్యర్థన మేరకు దీనిని 'డెనాలి'గా (కోయుకాన్ భాషలో 'ఎత్తు' అని అర్థం) మార్చారు.
ట్రంప్ తన అధికారాన్ని చేపట్టిన తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మారుస్తానని ప్రకటించారు.
ఈ ప్రతిపాదనను తొలిసారి మార్ ఎ లాగో ఎస్టేట్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రస్తావించారు.
Details
మెక్సికో నుంచి తీవ్ర వ్యతిరేకత
ఆ తర్వాత తన ఎన్నికల ప్రచారంలోనూ, పదవి స్వీకరణ అనంతరం కూడా దీన్ని పునరుద్ఘాటించారు.
గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసి, 'అమెరికా ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తివంతమైన దేశంగా తన స్థానాన్ని పొందిందని వ్యాఖ్యానించారు.
ఈ ప్రతిపాదనకు మెక్సికో నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ 1607లో వాడిన మ్యాప్‌లను చూపిస్తూ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరుకి చారిత్రక ప్రాముఖ్యతను వివరించారు.
అలాగే గతంలో ఉత్తర అమెరికాను 'మెక్సికన్ అమెరికా' అని పిలిచేవారని గుర్తు చేశారు.
Details
ప్రపంచంలోనే 9వ అతిపెద్ద జల వనరు
ఉత్తర అమెరికాలో సుమారు ఆరు లక్షల చదరపు మైళ్ల సముద్ర ప్రాంతాన్ని గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా పిలుస్తారు.
ఇది ప్రపంచంలోని 9వ అతిపెద్ద జల వనరు. మొదటిసారి ఈ పేరును 16వ శతాబ్దంలో స్పెయిన్‌కు చెందిన అన్వేషకులు వాడారు. ఈ ప్రదేశం అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉంది.
దేశంలో వినియోగించే సగానికి పైగా శుద్ధి చేసిన గ్యాస్ ఈ ప్రాంతంలోనే ఉత్పత్తి అవుతుంది. అమెరికా మత్స్య సంపదలో 40 శాతం ఈ ప్రదేశంలోనే లభిస్తుంది.