Page Loader
Dubai airport flooded : దుబాయ్ లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం

Dubai airport flooded : దుబాయ్ లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం

వ్రాసిన వారు Stalin
Apr 17, 2024
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

దుబాయ్ (Dubai) లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఏడాదిలో మొత్తంలో కురిసే వర్షమంతా మంగళవారం ఒక్కరోజులో కురిసింది. దీంతో దుబాయ్ నగరం సముద్రాన్ని తలపించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పూర్తిగా వరదనీటిలో మునిగిపోయింది. రోడ్లు నదులను తలపించాయి. ఇళ్లన్నీ ముంపునకు గురయ్యాయి. విమానాల సర్వీసులన్నీ అర్ధగంటసేపు నిలిచిపోయాయి. సాధారణంగా ఒక ఏడాదిలో దుబాయ్​ నగరంలో సగటున 88.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే మంగళవారం 12 గంటల్లోపు 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో 166 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తమ ప్రయాణికులకు విమాన సర్వీసుల సమయాన్నిచెక్ చేసుకోవాలని అదనపు గంటల ప్రయాణానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

Dubai-Floods

నిలిచిపోయిన విమాన సర్వీసులు

విమానాశ్రయంలోని రన్ వే పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో (Social Media) బాగా వైరల్ అయ్యాయి. యూకే (UK), ఇండియా (India), పాకిస్థాన్​ (Pakistan), సౌదీ కి వెళ్లే విమాన సర్వీసులు చాలావరకు నిలిచిపోయాయి. మరికొన్ని సర్వీసులు రద్దయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా కొన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ వాతావరణ కేంద్రం అబూదభీ, షార్జా, దుబాయ్ తో పాటు దేశవ్యాప్తంగా అత్యవసర వాతావరణ పరిస్థితిని ప్రకటించింది. దుబాయ్ లో రోడ్లన్నీ నదులను తలపించడంతో ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆకస్మిక భారీ వర్షపాతానికి పొరుగుదేశమైన ఒమన్ లో 18 మంది మరణించారు.

Dubai Airport-Havey Rains

వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనం

ఈ నెల 14న 10 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ వాహనం వరద నీటిలో కొట్టుకుపోయింది. బహ్రెయిన్ రోడ్ల మీద వాహనాలు నీటిలో తేలియాడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.