
Airport Ranks: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్‌పోర్టు టాప్.. వరల్డ్ టాప్-10లో భారతీయ ఎయిర్‌పోర్టు.. దేంట్లో అంటే..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలో అత్యధికంగా రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో మరోసారి దుబాయ్ విమానాశ్రయం అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
అంతర్జాతీయ విమానాశ్రయాల కౌన్సిల్ (ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ - ACI) తాజాగా విడుదల చేసిన 2023 గణాంకాల ప్రకారం, అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 విమానాశ్రయాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో భారత్‌కు చెందిన దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా స్థానం లభించింది.
77.8 మిలియన్ల ప్రయాణికులతో ఈ విమానాశ్రయం ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానం పొందింది.
వివరాలు
9.5 బిలియన్లకు చేరుకున్న ప్రయాణికుల సంఖ్య
మరోవైపు, లండన్‌లోని హీత్రో విమానాశ్రయం రెండవ స్థానంలో నిలవగా, దక్షిణ కొరియాలోని సియోల్ ఇంచియాన్, సింగపూర్, ఆమ్‌స్టర్‌డామ్ వంటి ప్రముఖ విమానాశ్రయాలు మొదటి ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి.
గల్ఫ్ ప్రాంతానికి మేజర్ హబ్‌గా పనిచేస్తున్న దుబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రధానంగా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు కేంద్రంగా ఉన్నదని నివేదిక పేర్కొంది.
2023లో ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య 92.3 మిలియన్లకు చేరగా,ఇది 2022తో పోలిస్తే 6.1 శాతం అధికం.
2024లో గ్లోబల్ స్థాయిలో విమానయాన రంగం గణనీయంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది.
మొత్తం ప్రయాణికుల సంఖ్య 9 శాతం పెరిగి సుమారుగా 9.5 బిలియన్లకు చేరుకున్నట్టు వెల్లడైంది.
ఇది కోవిడ్-19 మహమ్మారి ముందు ఉన్న స్థాయితో పోల్చితే 3.8 శాతం ఎక్కువ.
వివరాలు
మళ్లీ బలంగా పుంజుకుంటున్న విమానయాన రంగం
ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం మళ్లీ బలంగా పుంజుకుంటున్న సంకేతంగా ఇది భావిస్తున్నారు.
ఈ విషయాన్ని ACI సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో స్పష్టం చేసింది.
ప్రస్తుతం 172 దేశాల్లో ఉన్న 2,181 విమానాశ్రయాల్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో సుమారుగా 9.9 బిలియన్ల మంది ప్రయాణికులు ప్రయాణించనున్నారని సంస్థ అంచనా వేసింది.
అయితే, ప్రయాణికుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించినా, వారి వృద్ధి రేటు కొంత మేరకు మందగించిందని పేర్కొన్నారు.
దీనికి ప్రధానంగా ఆర్థిక పరిస్థితులలో అస్థిరత మరియు కొన్ని ప్రాంతాల్లో ఉన్న రాజకీయ భిన్నాభిప్రాయాలు, ఉద్రిక్తతలే కారణమని ACI వివరించింది.