LOADING...
Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం?
80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' పేరు?

Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల మధ్య టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ మరో కీలక చర్చను ప్రారంభించారు. అమెరికా రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ అవసరమా అనే అంశంపై ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ పోల్ నిర్వహించారు. '80 శాతం అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించే కొత్త పార్టీ ఏర్పాటుకు ఇది సరైన సమయమా?' అని తన 22 కోట్లకు పైగా ఫాలోవర్లకు 'ఎక్స్‌'లో (మాజీ ట్విట్టర్) మస్క్ ప్రశ్నించారు. అందులో 80 శాతం మంది అభిప్రాయాన్ని 'అవసరం ఉంది' అనే దిశగా వెల్లడించడంతో, ''ప్రజలే చెప్పారు. 80 శాతం మందికి ప్రాతినిధ్యం కల్పించే పార్టీ అవసరమని స్పష్టం చేశారని మస్క్ పేర్కొన్నారు.

Details

ట్రంప్ గెలుపునకు తానే కారణం : మస్క్

ఇదే సందర్భంగా ఆయన 'ది అమెరికా పార్టీ' అనే పేరుతో ఓ పోస్ట్ చేయడంతో.. మస్క్ నిజంగానే కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం దీనిపై ఎలాన్ మస్క్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే, ట్రంప్ - మస్క్ మధ్య వివాదం బహిరంగంగా తీవ్రతరం అవుతున్నది. మస్క్ చేసిన 'అధ్యక్షుడిగా ట్రంప్‌ గెలుపు సాధించడానికి నేనే కారణం' అనే వ్యాఖ్యలను ట్రంప్ ఘాటుగా ఖండించారు. 'నేను ఎలాన్ సహాయంతో గెలవలేదని స్పష్టం చేశారు.

Details

సంచలన ఆరోపణలు చేసిన మస్క్

ప్రభుత్వ సామర్థ్య విభాగం (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ - డోజ్‌) నుంచి మస్క్‌ను తప్పించడంతో ఆయనకు కోపం వచ్చిందని ట్రంప్ ఎద్దేవా చేశారు. దీనిపై మస్క్‌ కూడా సంచలన ఆరోపణ చేశారు. లైంగిక వేధింపుల కేసులో దోషిగా నిలిచిన జెఫ్రీ ఎప్‌స్టైన్‌ కేసులో ట్రంప్‌కు సంబంధం ఉందని ఆరోపించారు. అదే కారణంగా ఆ కేసుకు సంబంధించిన అధికారిక దస్త్రాలను ప్రభుత్వం బయటపెట్టడం లేదని చెప్పారు. ఈ సంఘటనల నేపథ్యంలో, మస్క్‌ 'ది అమెరికా పార్టీ' పేరుతో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.