Elon Musk: బైడెన్ ఫెడరల్ బడ్జెట్‌లో దుబారా ఖర్చులు.. రూ.168 లక్షల కోట్లు ఆదా చేయొచ్చు: మస్క్
త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే రూ.168 లక్షల కోట్లు ఆదా చేయగలమని టెస్లా CEO, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. బైడెన్ ప్రభుత్వానికి సంబంధించిన ఫెడరల్ బడ్జెట్‌లో దుబారా ఖర్చులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మస్క్‌ను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న "పార్లమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ" విభాగానికి అధిపతిగా నియమించనున్నట్లు కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ ఛైర్మన్ హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు.
ముందస్తు పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాలి: మస్క్
ఈ సందర్భంగా, మస్క్‌ను ప్రస్తుత ప్రభుత్వం వృథా చేస్తున్న ఖర్చులపై ఎంతవరకు ఆదా చేస్తారని అడగ్గా, ఆయన దాదాపు రూ.168 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని అన్నారు. రెట్టింపు ఖర్చులు ప్రజల నుంచి వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగా దేశ ప్రజల డబ్బు వృథా అవుతున్నట్లు పేర్కొన్న మస్క్, ట్రంప్ ప్రభుత్వ సమర్థత విభాగం ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పారు. దీనివల్ల అమెరికా ఎప్పుడూ చూడని ఎత్తులకు చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ మద్దతుదారులు తమ కుటుంబసభ్యులతో పాటు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని, ముందస్తు పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
మస్క్ పెద్ద మొత్తంలో విరాళాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి ఎలాన్ మస్క్ మద్దతు తెలుపుతూ, పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తున్నాడు. ట్రంప్, తనను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక చేస్తే, టెస్లా CEO ఎలాన్ మస్క్‌కు కేబినెట్‌లో చోటిస్తానని, లేకపోతే సలహాదారుడిగా నియమించుకుంటానని ప్రకటించారు. ఈ విషయంపై మస్క్ సానుకూలంగా స్పందిస్తూ, "డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ"కి నేతృత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ట్రంప్‌తో జరిగిన తాజా చర్చలో, ప్రభుత్వ పెట్టుబడులను క్రమబద్ధీకరించి వృథాను అరికట్టేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని మస్క్ ప్రతిపాదించారు.