
Elon Musk: బ్రిటన్‌లో వలసల వ్యతిరేక నిరసనలపై ఎలాన్ మస్క్ మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్‌లో వలసలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారీ నిరసనలకు టెస్లా సీఈఓ, ప్రపంచకుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. లక్ష మందికి పైగా ఆందోళనకారులు పాల్గొన్న ఈ ర్యాలీని వలస వ్యతిరేక ఉద్యమకారుడు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మస్క్ వర్చువల్‌గా ప్రసంగిస్తూ యూకేలో పాలన మార్పునకు పిలుపునిచ్చారు. దేశం విధ్వంసం అంచున ఉందని హెచ్చరించారు. "బ్రిటన్ పౌరుడిగా ఉండటం గొప్ప విషయం. కానీ ఇప్పుడు నేను చూస్తున్నది దేశం నాశనం కావడం. మొదట ఇది చిన్న స్థాయిలో ఉండేది. ఇప్పుడు మాత్రం అక్రమ వలసలతో దేశం నిండిపోయింది.
Details
పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలు జరపాలి
ఇలాగే కొనసాగితే హింస మీ దగ్గరకు చేరుతుంది. మీ వద్ద రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి, తిరిగి పోరాడండి లేకపోతే నశించండి. ఇదే వాస్తవమని మస్క్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో ఆయన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పార్లమెంటును రద్దు చేసి కొత్త ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇక ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ కార్యకర్త చార్లీ కిర్క్ హత్యకు గురైన ఘటనను ప్రస్తావించిన మస్క్, అమెరికాలో హింస పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.