
Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులతో సంబంధాలు నిలిపివేయాలని కెనడాలోని రాజకీయ పార్టీలకు ఆ దేశ మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ స్పష్టంగా సూచించారు. కెనడాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హార్పర్ మాట్లాడుతూ, భారతదేశంతో మైత్రీబంధాలను కొనసాగించాలని ఆశించే ఏ పార్టీ అయినా, దేశాన్ని విడగొట్టాలని యత్నిస్తున్న వేర్పాటువాదులతో సంబంధాలను కొనసాగిస్తే, న్యూఢిల్లీతో బలమైన సంబంధాలను కొనసాగించడం అసాధ్యమని పేర్కొన్నారు. భారత విభజన కోసం పని చేస్తున్న శక్తుల నుంచి రాజకీయ పార్టీలు తమను తాము దూరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని హార్పర్ హితవు పలికారు. ఈ విషయంలో ఇప్పటివరకు వివిధ పార్టీలు ఎందుకు ఆలస్యం చేశాయో తనకు అర్థం కావడం లేదని అన్నారు.
వివరాలు
రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కార మార్గం
తాను ప్రధాని పదవిలో ఉన్న కాలంలో ఇలాంటి వేర్పాటువాద శక్తుల నుంచి దూరంగా ఉండే విధానాన్నే పాటించామని, ఇప్పటి రాజకీయ నాయకత్వం కూడా అదే మార్గాన్ని అనుసరిస్తుందని తన ఆకాంక్ష అని హార్పర్ చెప్పారు. భారత్ కెనడా మిత్రదేశాలుగా అనేక దశాబ్దాలుగా ఉన్న నేపథ్యంలో, మధ్యలో ఏర్పడిన తేడాలను తొలగించి, మళ్లీ బలమైన బంధాన్ని ఏర్పరచుకోవాలంటే జిహాదీలు, యాంటీ సెమిట్లు, ఖలిస్థానీ వర్గాలు లాంటి విభజన శక్తులను ప్రోత్సహించడం తక్షణమే నిలిపివేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇదే రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కార మార్గమని స్పష్టం చేశారు.
వివరాలు
భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపిన కెనడా
హార్పర్ 2006 నుంచి 2015 వరకు కన్జర్వేటివ్ పార్టీ తరపున కెనడా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 1985 జూన్ 23న ఖలిస్థానీ ఉగ్రవాదులు భారత ఎయిర్ ఇండియా విమానం "కనిష్క"పై బాంబు దాడికి పాల్పడ్డ ఘటనపై ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తి జాన్ మేజర్ నేతృత్వంలో కొనసాగిన ఆ కమిషన్ 2010 జులై 16న తన నివేదికను సమర్పించింది. ఈ దాడికి కారణమైన భద్రతా వైఫల్యాలపై తమ ప్రభుత్వం తరపున అప్పుడే భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు.
వివరాలు
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం
ఇక భారత్-కెనడా దేశాల మైత్రి సంబంధాలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానిగా జస్టిన్ ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ ఆయన ఆరోపించడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. అనంతరం కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుంటోందంటూ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసు డిప్యూటీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దూరం పెరిగింది కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారత్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.