
Pakistan:గ్రే లిస్ట్ నుంచి డిజిటల్ హవాలాలోకి.. జైషేను బతికించడానికి పాకిస్తాన్ డర్టీ ట్రిక్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ నిర్భయంగా ఉగ్రవాదాన్ని పెంపొందిస్తోంది. ఎఫ్‌ఏటీఎఫ్ ఆంక్షలకు భయపడకుండానే జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ కొత్త హవాలా పద్ధతిలో డబ్బులు తరలిస్తున్నట్లు తేలింది. ఈ నిధులను ఉపయోగించి ఉగ్రవాద శిక్షణ, భారత్‌పై దాడుల్లో నాశనమైన క్యాంపులు తిరిగి నిర్మించడం, ఇంకా కార్యకలాపాలను విస్తరిస్తోంది.
పాక్
అబద్ధాలు చెప్పి గ్రేజాబితా బయటకు..
ఆంక్షల ముప్పును తప్పించుకుంటూనే టెర్రరిజాన్ని కొనసాగిస్తూనే పెంచే పనిలో పడింది పాకిస్థాన్. 2019లో ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు పాక్ ప్రభుత్వం "నేషనల్ యాక్షన్ ప్లాన్" అమలవుతోందని ప్రకటించింది. దాని ప్రకారం జైషే మహ్మద్‌కు నిధులు ఆగిపోయేలా మసూద్ అజర్, రవూఫ్ అస్గర్, తాల్హా అల్ షఫీ తదితరుల బ్యాంక్ ఖాతాలను మూసివేసినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆంక్షలు అమలు చేస్తున్నట్టు నటించి, ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటపడింది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ, జైషే కలిసి నిధుల కోసం డిజిటల్ వాలెట్ల మార్గాన్ని తెరిచాయి. ఇందుకోసం ఈజీపైసా, సదాపే వంటి పాకిస్థానీ వాలెట్లను ఉపయోగించడం ప్రారంభించాయి.
వివరాలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత విస్తరణ
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మర్కజ్ సుభానల్లాతో పాటు మర్కజ్ బిలాల్, మర్కజ్ అబ్బాస్, మహమోన జోయా, సర్గాల్ వంటి నాలుగు శిక్షణ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. తరువాత వీటిని పునర్నిర్మించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు ప్రకటించింది. అంతేకాక, జైషే మహ్మద్ కూడా ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించాయి. ఈజీపైసా వాలెట్ ద్వారా దాదాపు 391 కోట్ల పాకిస్థానీ రూపాయలు సమీకరించి, దేశవ్యాప్తంగా 313 ఉగ్ర శిక్షణ కేంద్రాలను స్థాపించాలనే ప్రణాళిక ఉంది. మసూద్ అజర్ కుటుంబం ఈ నిధులన్నింటినీ తాము నిర్వహిస్తున్న వాలెట్లకు మళ్లిస్తోంది.
వివరాలు
ప్రచారంతో నిధుల సేకరణ
జైషే తన కేడర్‌ను నిధుల సమీకరణలోకి దింపింది. వారు మసూద్ అజర్ పేరిట పోస్టర్లు, వీడియోలు, లేఖలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇందులో 313 కొత్త మర్కజ్‌లు నిర్మించాలనుకుంటున్నామని, ఒక్కో కేంద్రానికి 1.25 కోట్ల పాకిస్థానీ రూపాయలు అవసరమని ఉగ్ర సంస్థ సానుభూతిపరులను కోరుతోంది.
వివరాలు
డిజిటల్ వాలెట్ల మార్గంలో..
ఉగ్ర నిధుల కోసం అనేక వాలెట్లు సృష్టించారు. సదాపే వాలెట్.. తాల్హా అల్ షఫీ పేరిట ఓ ఖాతా తెరిచారు. దీనికి హరిపూర్ జిల్లా కమాండర్ అఫ్తాబ్ అహ్మద్ ఫోన్ నెంబర్‌ను వాడారు. ఈజీపైసా వాలెట్.. మసూద్ అజర్ కుమారుడు అబ్దుల్లా పేరిట నిర్వహిస్తున్నారు. మరో ఈజీపైసా ఖాతా.. ఖైబర్ ప్రావిన్స్ కమాండర్ సయ్యద్ సఫ్దార్ పేరిట ఉంది. ఇవేకాక, జైషే సభ్యుల పేరిట 250కి పైగా వాలెట్లు చురుకుగా నడుస్తున్నట్లు సమాచారం.
వివరాలు
కోట్లలో సొమ్ము
మసూద్ అజర్ కుటుంబం 7-8 వాలెట్లను నేరుగా నిర్వహిస్తోంది.ప్రతి మూడు-నాలుగు నెలలకు వాటిని మార్చేస్తూ,ఒక ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బు జమ చేసి,తర్వాత 10-15 చిన్న ఖాతాలకు తరలిస్తున్నారు. జైషే నెలకు సగటున 30కొత్త వాలెట్లను యాక్టివ్ చేస్తుండటంతో నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎటు వెళ్లాయో గుర్తించడం ఇబ్బందికరంగా మారింది.
వివరాలు
గల్ఫ్ దేశాల నుంచి నిధులు
ఈ విధానంలో ఆ సంస్థకు 80 శాతం నిధులు వస్తున్నాయి. ఈ నిధులను ఉగ్ర శిక్షణ కేంద్రాలు, ఆయుధాల కొనుగోళ్లు, కమ్యూనికేషన్ సదుపాయాలు, విలాసవంతమైన వాహనాలు, మసూద్ కుటుంబ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచే ఈ నిధులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఫలితంగా ఈజీపైసా, జైషే నిధుల ప్రధాన మార్గంగా మారిపోయింది. పాక్ ఎఫ్‌ఏటీఎఫ్ నిబంధనలు పాటిస్తున్నట్టు ప్రకటించినా... వాస్తవానికి జైషే డిజిటల్ హవాలా నిరంతరాయంగా కొనసాగుతోంది.