Israel-Hezbollah: ఇజ్రాయెల్‌పై 90కి పైగా రాకెట్లతో హిజ్బుల్లా దాడి.. చిన్నారి సహా నలుగురు వ్యక్తులకు గాయాలు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత హిజ్బుల్లా తొలి సారిగా పెద్ద ఎత్తున దాడికి దిగింది. ట్రంప్ ఎన్నికతో ఈ ప్రాంతంలో హింస తగ్గుతుందని చాలా మంది భావించారు. కానీ, లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా సోమవారం ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడికి తెగబడింది. ఏకకాలంలోనే 90 క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' సిస్టమ్ చాలా మటుకు అడ్డగించినప్పటికీ , కొన్ని క్షిపణులు హైఫా బేలోని ప్రాంతాలను తాకినట్లు పేర్కొన్నారు. ఈ తాజా దాడిలో చిన్నారి సహా నలుగురు గాయపడినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది.
లెబనాన్ పేలుళ్లలో 39 మంది మృతి
హైఫా బేలోని కారు శ్రేణులు అగ్నికి ఆహుతయ్యాయి, ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెబనాన్‌లో జరిగిన పేలుళ్లకు ఇజ్రాయెల్ హస్తముందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చేసిన ప్రకటన తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. లెబనాన్ పేలుళ్లలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు, వందలమంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ రక్షణ దళం వెల్లడించిన వివరాల ప్రకారం, మొదట 80 రాకెట్లు ప్రయోగించగా, ఎక్కువ భాగాన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. రెండో దఫా 10 రాకెట్లు కూడా ప్రయోగించగా, వాటిని పూర్తిగా అడ్డుకున్నట్లు తెలిపింది.