
Tariffs: 'ఇది నిజమైన స్నేహితుడు చేసే పని కాదు'..ట్రంప్ ప్రరస్పర సుంకాలపై స్పందించిన దేశాధినేతలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
అన్ని దేశాలు తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని, అయితే కనీసం 10% సుంకం చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టంగా తెలిపారు.
ట్రంప్ నిర్ణయంపై అనేక దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు.
నిజమైన మిత్రుడైతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ అన్నారు.
ఆస్ట్రేలియాపై ప్రభావం
ఆస్ట్రేలియా నుండి దిగుమతులపై ట్రంప్ 10% సుంకం విధించారు.దీనిపై స్పందించిన ఆల్బనీస్, ''ఇది నిజమైన స్నేహితుడు చేసే పని కాదు. ఈ విధించిన సుంకాలు ఊహించదగినవే అయినప్పటికీ అవి పూర్తిగా అసంబద్ధమైనవి. ట్రంప్ టారిఫ్ చర్యల మూలంగా చివరకు అమెరికా ప్రజలే భారాన్ని భరించాల్సి వస్తుంది'' అని వ్యాఖ్యానించారు.
వివరాలు
ఇటలీ, స్వీడన్ స్పందన
ఇటలీ (Italy) ప్రధాని జార్జియా మెలోని (Giorgia Meloni) కూడా ట్రంప్ విధించిన సుంకాలపై స్పందిస్తూ, యూరోపియన్ యూనియన్ (EU) దిగుమతులపై సుంకాలు విధించడం ఇరుపక్షాలకూ అనుకూలం కాదని అన్నారు.
అయితే, ఈ అంశంపై అమెరికాతో ఓ అవగాహన ఒప్పందం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ఇదే సమయంలో, స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ట్రంప్ టారిఫ్‌లకు వ్యతిరేకంగా స్పందిస్తూ, ''మేము వాణిజ్య యుద్ధం కోరుకోవడం లేదు. అమెరికాతో కలిసి టారిఫ్‌లపై ఓ ఉమ్మడి ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నాం. ఇది ఇరుదేశాల ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచగలదు'' అని అన్నారు.
వివరాలు
ప్రతీకార సుంకాల బెదిరింపు
అమెరికా ఇప్పటికే కెనడా (Canada) నుండి దిగుమతయ్యే వస్తువులపై 25% సుంకం విధించిన సంగతి తెలిసిందే.
తాజా ట్రంప్ ప్రకటనపై కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) స్పందిస్తూ, ''అమెరికా విధించిన భారీ సుంకాలకు వ్యతిరేకంగా మేము పోరాడతాం. అంతేకాక, మేము కూడా ప్రతీకార సుంకాలను విధిస్తాం'' అని హెచ్చరించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం మిలియన్లాది కెనడియన్లపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
వివరాలు
యూరప్,లాటిన్ అమెరికా దేశాల స్పందన
ఈ వాణిజ్య పోరు ఎవరికీ మేలు చేయదని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) స్పష్టం చేశారు.
టారిఫ్‌ల వ్యతిరేకంగా తాము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. జర్మనీ, స్పెయిన్ (Spain) సహా అనేక ఇతర దేశాలు కూడా తమ తమ వాణిజ్య ప్రయోజనాలను రక్షించుకునేందుకు ప్రతీకార సుంకాలను ప్రకటించాయి.
బ్రెజిల్ ప్రభుత్వం కూడా ట్రంప్ విధించిన సుంకాలకు ప్రతిస్పందనగా బుధవారం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది.
అయితే, అమెరికా నిర్ణయంపై బ్రెజిల్ ప్రధాని ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.