Donald Trump: కమలా హారిస్‌ను కాదని డొనాల్డ్ ట్రంప్‌కు హిందూ మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. భారత మూలాలు ఉన్న కమలా హారిస్ కాదని 'హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్' సంస్థ ట్రంప్‌కు మద్దతు ప్రకటించడం గమనార్హం. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందూజా వెల్లడించారు. సందూజా ప్రకటనలో, ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కమలా హారిస్ నాయకత్వంలో అవి అస్థిరంగా మారే అవకాశం ఉందని తెలిపారు.
మోదీతో ట్రంప్ కు మంచి అనుబంధం
కమలా హారిస్ అధ్యక్షురాలైతే, భారత్‌కు సంబంధించిన అంశాలపై ఆందోళనకర నిర్ణయాలు తీసుకోవచ్చని, ఉదారవాదుల ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సందూజా పేర్కొన్నారు. బైడెన్-హారిస్ యంత్రాంగంలో అక్రమ వలసలు, సరిహద్దు భద్రత, నేరాలు, డ్రగ్ స్మగ్లింగ్ వంటి సమస్యలు పెరిగాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, భారత్‌కు అనుకూలంగా రక్షణ, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత బలపడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్‌కు ఉన్న మంచి అనుబంధం భారత్-అమెరికా సంబంధాలను మెరుగుపరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.