Hurricane Milton: దూసుకొస్తున్న హరికేన్ మిల్టన్.. భయం గుప్పిట్లో ఫ్లోరిడా..'100 సంవత్సరాలలో అత్యంత ఘోరమైన తుఫాను'
అమెరికాను ఒక తుపాను నుంచి బయటపడకముందే మరో తుఫాను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా హెలెన్ తుఫాను సృష్టించిన విపత్తు ఇంకా తీరకముందే, ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్ హరికేన్ దూసుకురావడంతో ఆందోళన కొనసాగుతోంది. మిల్టన్ ఐదో కేటగిరీ హరికేన్‌గా రూపాంతరం చెందిందని, ఇది అత్యంత శక్తిమంతమైన తుఫానుగా వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాను వల్ల ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫ్లోరిడా పశ్చిమ తీరం వైపుగా కదులుతున్న ఈ తుఫాను బుధవారం తీరం దాటవచ్చని అంచనా.
తుఫాను సమయంలో గంటకు 285 కిలోమీటర్ల వేగంతో గాలులు
ఎన్‌హెచ్‌సీ (నేషనల్ హరికేన్ సెంటర్) ప్రకారం, బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్ర గాలులు వీస్తాయని హెచ్చరించింది. మిల్టన్ ఐదో కేటగిరీ అయినందున, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ప్రారంభించారు. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. తుఫాను దారిలో ఉన్న విమానాశ్రయాలను మూసివేశారు, ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. మిల్టన్ తుఫాను సాఫిర్-సింప్సన్ స్కేలుపై ఐదో కేటగిరీగా నమోదైంది. ఈ తుఫాను సమయంలో గంటకు 285 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఎన్‌హెచ్‌సీ వెల్లడించింది.
హరికేన్‌లు మూడో కేటగిరీని దాటినప్పుడు ప్రాణ నష్టం,ఆస్తి నష్టం
మొదట రెండో కేటగిరీగా ఉన్న ఈ తుఫాను కొద్దిసేపట్లోనే ఐదో కేటగిరీకి చేరింది. తుఫాను ఈ స్థాయికి చేరడం ఫ్లోరిడా వాతావరణ నిపుణులకు కూడా ఆశ్చర్యంగా ఉంది. చరిత్రలో ఇంత శక్తివంతమైన హరికేన్ ఇదే కావచ్చని చెబుతున్నారు.గత శతాబ్దంలో కూడా ఇంతటి తీవ్రత కలిగిన తుఫాను ఈ ప్రాంతంలో రాలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా, హరికేన్‌లు మూడో కేటగిరీని దాటినప్పుడు ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాను నాలుగో కేటగిరీ హరికేన్‌గా 225 కి.మీ వేగంతో గాలులు వీచింది, దీనివల్ల ఆస్తి నష్టం కూడా సంభవించింది.
ఫ్లోరిడాలోని లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలించాలి : బైడెన్
దీని ప్రభావం కారణంగా నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో 230 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మృతదేహాలు వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2024 హరికేన్ సీజన్ సాధారణం కంటే చాలా తీవ్రమైనదని, వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని నేషనల్ ఓషియానిక్ అటా్మస్ఫియరిక్ అసోసియేషన్ (ఎన్‌ఓఏఏ) అంచనా వేసింది. ఫ్లోరిడాలోని లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధ్యక్షుడు జో బైడెన్ సూచించారు. ఇది ప్రాణాంతక సమస్యగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
మిల్టన్ కోసం ఫ్లోరిడా ఎంత సిద్ధంగా ఉంది?
అయిదో కేటగిరీ హెచ్చరిక అంటే, ఆ తుఫాను ఒక టోర్నాడోలా ఉండొచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్లోరిడాలో డజన్ల సంఖ్యలో షెల్టర్లను సిద్ధం చేశామని ఆ రాష్ట్ర గవర్నర్ రాన్ డీసాంటిస్ తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ స్టేషన్లలో భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి, కొన్ని స్టేషన్లలో ఇంధనం అందుబాటులో లేకపోయినప్పటికీ, పెట్రోల్ సరఫరా కొనసాగిస్తున్నామని,అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మిల్టన్ హరికేన్ నేపథ్యంలో దేశాధ్యక్షుడు బైడెన్ తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. జర్మనీతో పాటు అంగోలాలో ఆయన పర్యటించాల్సి ఉన్నది. కానీ పునరావాస పనులను పర్యవేక్షించేందుకు ఆయన స్వదేశంలోనే ఉండిపోనున్నారు. ఫ్లోరిడాలో ప్రసిద్ధ టూరిస్టు కేంద్రాలైన డిస్నీ ల్యాండ్, కెన్నడీ స్పేస్ సెంటర్‌లను మూసివేశారు.