Page Loader
Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ ఏర్పాటు
ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ ఏర్పాటు

Imran Khan: పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ కొత్త పార్టీ ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ఎదురైన ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ ప్రభుత్వం బిజీగా ఉండగా, అదే సమయంలో ఆ దేశ రాజకీయ రంగంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టి కొత్త పార్టీని స్థాపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వివరాలు 

'పాకిస్థాన్‌ రిపబ్లిక్‌ పార్టీ' పేరుతో కొత్త పార్టీ

రెహమ్ ఖాన్‌ 'పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ' పేరుతో తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ''ఇది కేవలం మరో పార్టీ కాదని, ప్రజా సమస్యలపై పోరాటానికి రూపుదిద్దుకున్న ఉద్యమం'' అని పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావడం తనకు నూతన అనుభవమేనని, ఇప్పటివరకు ఎలాంటి పదవులు లేదా అధికారాలలో తాను పాల్గొనలేదని ఆమె గుర్తుచేశారు. ఇమ్రాన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు ''ఒకప్పుడు ఓ వ్యక్తి కోసం పార్టీలో చేరాను. కానీ ఈసారి మాత్రం, నిస్వార్థంగా ప్రజల కోసం నా సొంతంగా రాజకీయాల్లోకి వచ్చాను,'' అని చెప్పిన ఆమె, పరోక్షంగా ఇమ్రాన్ ఖాన్‌ పేరును ప్రస్తావించకుండానే చురకలేశారు.

వివరాలు 

ప్రజల నిరాశే కొత్త పార్టీకి ప్రేరణ 

ప్రస్తుత పాలక వ్యవస్థపై ప్రజల్లో పెరుగుతున్న విరక్తి, రాజకీయాల పట్ల నిరాశే తన కొత్త రాజకీయ ప్రయాణానికి బలమైన ప్రేరణగా నిలిచినట్లు రెహమ్ ఖాన్ తెలిపారు. పాలకవర్గం చేపడుతున్న వ్యవహారశైలి, సామాన్య ప్రజలకు అందని ప్రాథమిక వసతులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 2012 నుండి ఇప్పటివరకు దేశంలో కనీస అవసరాలు అందక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదనతో పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇక న్యాయంగా, నైతికంగా కొనసాగించదగినది కాదని ఆమె తేల్చి చెప్పారు.

వివరాలు 

కుటుంబ పాలనపై విమర్శలు.. త్వరలో పార్టీ మేనిఫెస్టో 

రెహమ్ ఖాన్ తన పార్టీని ఒక వ్యక్తిగత ప్రయోజనం కోసం గాక, దేశ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ప్రారంభించానని స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాలు పాక్‌ను చీకటి దిశగా నడిపిస్తున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండానే, పూర్తిగా స్వతంత్రంగా ఈ పార్టీని ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. కరాచీపై ప్రత్యేక అభిమానం కరాచీలో ప్రెస్‌ క్లబ్‌ సమావేశంలో పార్టీ ప్రారంభ వివరాలను వెల్లడించిన ఆమె, ''బాధల సమయంలో ఈ నగరమే నాకు ధైర్యం ఇచ్చింది, అండగా నిలిచింది'' అంటూ కరాచీపై తన ప్రత్యేక ప్రేమను వ్యక్తం చేశారు.