
Trump: ఇండోనేషియా తరహాలోనే భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చేశారు. ఇండోనేషియా వాణిజ్య ఒప్పంద మార్గంలోనే భారత్ కూడా అడుగులు వేస్తున్నదని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం లేదా ఏకపక్షంగా విధించబడుతున్న సుంకాలను ఎదుర్కొనేందుకు ఆయన నిర్ణయించిన ఆగస్టు 1 గడువుకు ముందే భారత్-అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పంద మాదిరిగానే భారత్ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోందని,ఇది రెండు దేశాల మార్కెట్లకు ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇండోనేషియా ఒప్పందానికి అనుసంధానంగా అమెరికాలోకి దిగుమతులు జరిగితే వాటిపై 19 శాతం సుంకం విధిస్తారు.
వివరాలు
ట్రంప్ యూరోపియన్ యూనియన్‌కి లేఖలు
అయితే ఇండోనేషియా నుంచి దిగుమతులకు సుంకం ఉంటే, ఇండోనేషియాకు అమెరికా నుండి జరిగే ఎగుమతులపై మాత్రం ఎటువంటి సుంకాలు ఉండవని ట్రంప్ వాషింగ్టన్‌లో వెల్లడించారు. ఇప్పుడు భారత్ కూడా ఇదే తరహాలో ఒప్పందం కోసం పనిచేస్తోందని, త్వరలో అదే తరహా ఒప్పందాన్ని భారత్‌తో కుదుర్చుకోబోతున్నామని చెప్పారు. ఆగస్టు 1 నాటికి ఒప్పందం కుదరని పక్షంలో 35 శాతం వరకు సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ యూరోపియన్ యూనియన్‌కి లేఖలు పంపినట్టు సమాచారం. భారత్-అమెరికా మధ్య కుదిరే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఇండోనేషియా ఒప్పందాన్ని ప్రతిబింబిస్తే, భారతదేశం నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులపై 19 శాతం సుంకం విధించనున్నట్టు తెలుస్తోంది. అలాగే అమెరికా నుండి భారత్‌కు దిగుమతులపై ఎటువంటి సుంకాలు ఉండవని సమాచారం.