LOADING...
Congo: కాంగోలో ఊచకోత.. 52 మందిని కత్తులతో నరికి చంపిన ఏడీఎఫ్‌ దుండగులు
కాంగోలో ఊచకోత.. 52 మందిని కత్తులతో నరికి చంపిన ఏడీఎఫ్‌ దుండగులు

Congo: కాంగోలో ఊచకోత.. 52 మందిని కత్తులతో నరికి చంపిన ఏడీఎఫ్‌ దుండగులు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఘోర మానవహత్యలు చోటుచేసుకున్నాయి. ఇస్లామిక్‌ స్టేట్‌ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయి,కత్తులు,గొడ్డళ్లతో పౌరులపై దాడి చేసి 52 మందిని దారుణంగా హతమార్చింది. ఈ ఘటనపై అక్కడి అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగో సైన్యంతో ఇటీవల జరిగిన యుద్ధంలో పరాజయం పాలైన అలైడ్‌ డెమోక్రటిక్‌ ఫోర్సెస్‌ (ఏడీఎఫ్‌) సభ్యులు ప్రతీకారంగా ఈ మారణకాండకు పాల్పడ్డారని అధికారులు స్పష్టం చేశారు. బెని, లుబెరో ప్రాంతాల్లో నివసిస్తున్న సాధారణ ప్రజలపై తిరుగుబాటుదారులు దాడి జరిపారు. నిద్రలో ఉన్న వారిని లేపి, చేతులు కట్టేసి, అమానుషంగా కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారని స్థానిక వర్గాలు వివరించాయి. మెలియా గ్రామంలోనే దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

వివరాలు 

6వేలమంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు

మొత్తం మృతుల సంఖ్యలో ఎనిమిది మంది మహిళలు,ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈఘటనలో 52మంది అక్కడికక్కడే మృతి చెందగా,కొందరిని ఇళ్లలోనే కిరాతకంగా కాల్చి చంపినట్లు చెప్పారు. మృతులసంఖ్య మరింత పెరగొచ్చని హెచ్చరించారు.గత నెలలో కూడా ఏడీఎఫ్‌ తిరుగుబాటుదారులు ఒక కాథలిక్‌ చర్చి ప్రాంగణంలో కాల్పులు జరిపి 38మందిని బలిగొన్న విషయం గుర్తుచేశారు. స్థానికప్రజల్లో భయాందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు.ఉగాండా-కాంగో సరిహద్దు ప్రాంతాల్లో చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏడీఎఫ్‌ అనే ఈ తిరుగుబాటు సంస్థ,గత కొన్ని ఏళ్లుగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది. 2013నుంచి ఇప్పటి వరకు వారి దాడుల్లో దాదాపు 6వేలమంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ దుర్మార్గ సంస్థపై అమెరికా,ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఇప్పటికే ఆంక్షలు విధించాయి.