Trump to Netanyahu: బీబీకి దక్కిన 'బెస్ట్ డీల్' ఇదేనా!?.. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌తో కుదిరిన తాజా శాంతి ఒప్పందమే ఇజ్రాయెల్‌కు దక్కిన అత్యుత్తమ ఒప్పందమని, అంతకంటే మెరుగైన భద్రతా హామీ ఆ దేశానికి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కూడా తాను స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఒప్పందానికి ముందు నెతన్యాహుతో తాను ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. ఈ ఒప్పందం కారణంగా ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద భద్రతా ముప్పు తొలగిపోయిందని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఆలోచించు బీబీ
ఆ సంభాషణలో నెతన్యాహును ఆయన ముద్దుపేరు 'బీబీ'తో సంబోధిస్తూ..''ఆలోచించు బీబీ.. నీకు ఇది బెస్ట్ డీల్. ఇకపై ఇజ్రాయెల్‌పై అణు దాడి జరిగే ప్రమాదం ఉండదు''అని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే అవకాశమే ఇజ్రాయెల్‌కు అతిపెద్ద ఆందోళనగా ఉందని, తాజా ఒప్పందంతో ఆ ముప్పు గణనీయంగా తగ్గిందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ఎన్నాళ్లుగానో కోరుకుంటున్న కీలక భద్రతా హామీ ఇదేనని నెతన్యాహుకు వివరించినట్లు తెలిపారు. ఫ్రాన్స్‌లోని ఈవియన్-లెస్-బెయిన్స్‌లో జరిగిన జీ7 సమావేశాలకు హాజరైన ట్రంప్,పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. అదే సందర్భంగా ఇరాన్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకం చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలోనే ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఆర్థిక ఆంక్షల సడలింపుపై కూడా ప్రతిపాదనలు
అయితే అమెరికా-ఇరాన్ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇరాన్ తన అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించాల్సి ఉంటుంది. అదే సమయంలో కొన్ని ఆర్థిక ఆంక్షల సడలింపుపై కూడా ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే లెబనాన్ పరిస్థితులు, ఇజ్రాయెల్ సైనిక చర్యలు,హెజ్‌బొల్లా కార్యకలాపాలు వంటి సున్నిత అంశాలు కూడా ఈ చర్చల్లో భాగమయ్యాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాతే పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మధ్యలో కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ,హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ లెబనాన్‌పై తీవ్ర దాడులు కొనసాగించింది.
వివరాలు
దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు: నెతన్యాహు
ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని దాడులను తగ్గించాలని సూచించినప్పటికీ, నెతన్యాహు పరిమిత సైనిక చర్యలను కొనసాగించినట్లు అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ దాడుల్లో లెబనాన్‌లో భారీ ప్రాణనష్టం సంభవించగా, దాదాపు ఐదు వేల మంది మరణించినట్లు అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇరాన్-అమెరికా ఒప్పందంలో లెబనాన్ సహా వివాదాస్పద ప్రాంతాల్లో సైనిక చర్యలను నిలిపివేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఇప్పటికే స్పష్టం చేశారు.
వివరాలు
అవసరమైతే భద్రతా చర్యలను కొనసాగిస్తామని సంకేతాలు
అవసరమైతే భద్రతా చర్యలను కొనసాగిస్తామని సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు అధికార వర్గంలోని కొందరు మాజీ నేతలు కూడా నెతన్యాహుపై ఒత్తిడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందం కేవలం పశ్చిమాసియా రాజకీయాలకే పరిమితం కాకుండా, ఇజ్రాయెల్ భద్రతా వ్యూహాలు, ప్రాంతీయ శక్తి సమీకరణాలు, భవిష్యత్ దౌత్య సంబంధాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.