Iran: ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్.. అమెరికా నిఘా హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు నివేదికలు అందజేశాయి. ఈ అంశాన్ని వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ట్రీట్ జర్నల్‌లు కథనాలుగా ప్రచురించాయి.
2025 మధ్యలో ఇజ్రాయెల్ ముందస్తు దాడికి ఉపక్రమించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ దాడుల ద్వారా ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొన్ని రోజులు లేదా నెలల పాటు వాయిదా వేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ దాడులకు మద్దతు ఇవ్వాలని ప్రస్తుత డొనాల్డ్ ట్రంప్ పాలనను ఇజ్రాయెల్ కోరే అవకాశం ఉందని ఆ నివేదికలు వెల్లడించాయి.
ఇరాన్‌పై దాడికి అవసరమైన ఆయుధాలను అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు అందించే అవకాశం ఉంది.
ఈ అంశంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం, ఇజ్రాయెల్ సైన్యం, అలాగే శ్వేతసౌధం స్పందించేందుకు నిరాకరించాయి.
Details
ఇరాన్ అణ్వాయుధ తయారీకి ట్రంప్ ప్రభుత్వం సహకరించదు
వాషింగ్టన్ పోస్టుతో శ్వేతసౌధం ఎన్‌ఎస్‌సీ ప్రతినిధి బ్రియాన్ హ్యూస్ మాట్లాడుతూ, ఇరాన్ అణ్వాయుధ తయారీకి ట్రంప్ ప్రభుత్వం సహకరించదని స్పష్టం చేశారు.
ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తామని, అది సాధ్యం కాకపోతే ఇతర మార్గాలను పరిశీలిస్తామని తెలిపారు.
ఇటీవల ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
తాను ఒప్పందానికి సిద్ధంగా ఉన్నా, ఇరాన్ మాత్రం ఘర్షణకే ఆసక్తి చూపుతోందని పేర్కొన్నారు. ఇరాన్‌లోని ఫాద్వా, నటాంజ్ అణుస్థావరాలపై దాడులు జరగొచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ జనవరిలోనే హెచ్చరించింది.
అక్టోబర్‌లో జరిగిన బాంబింగ్ దాడిలో ఇజ్రాయెల్ టెహ్రాన్ ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది.
ఈ కారణంగా గగనతల దాడులను గుర్తించే ఇరాన్ సామర్థ్యం తగ్గిందని అమెరికా అధికారి వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్టు కథనంలో పేర్కొంది.